: కదిలిన బాలాపూర్ గణేష్... కాసేపట్లో లడ్డూ వేలం
భాగ్యనగరంలో వినాయక శోభాయాత్రకు ముందు నిలిచే బాలాపూర్ గణేషుడు కదిలాడు. ఈ ఉదయం భారీ క్రేన్ సాయంతో వినాయక విగ్రహాన్ని అందంగా అలంకరించిన లారీపైకి చేర్చారు. ఉదయం 9 గంటల తరువాత విగ్రహం చేతుల్లో ఉంచిన లడ్డూ వేలం జరుగుతుందని బాలాపూర్ గ్రామ కమిటీ వెల్లడించింది. గత సంవత్సరం లడ్డూ ధర రూ. 9.5 లక్షలు పలుకగా, ఈ సంవత్సరం అంతకన్నా ఎక్కువ ధర పలుకుతుందని అంచనా. కాగా, గణేష్ నిమజ్జనాన్ని ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు గట్టి బందోబస్తు చర్యలు చేపట్టారు. ఇతర జిల్లాల నుంచి వచ్చే బస్సులేవీ నగరంలోకి ప్రవేశించకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశారు. విజయవాడ, నల్గొండ వైపు నుంచి వచ్చే బస్సులు ఎల్.బీ. నగర్ చౌరస్తా నుంచి వెనక్కు మళ్లుతాయి. నిజామాబాద్, కరీంనగర్ ప్రాంతాల బస్సులను జేబీఎస్ వరకూ, కర్నూలు వైపు బస్సులు ఆరాంఘర్ చౌరస్తా వరకూ, వికారాబాద్ వైపు నుంచి వచ్చే బస్సులను మెహిదీపట్నం వరకూ, వరంగల్ వైపు నుంచి వచ్చే బస్సులను ఉప్పల్ వరకు మాత్రమే అనుమతిస్తామని అధికారులు వెల్లడించారు. జంట నగరాల్లో శోభాయాత్ర జరిగే మార్గాల్లో 2 వేలకు పైగా కెమేరాలు ఏర్పాటు చేసిన పోలీసులు అనుక్షణం విగ్రహాల కదలికపై నిఘా పెట్టారు.