: అధికారులకు ముచ్చెమటలు పట్టించిన కేంద్రమంత్రి కాన్వాయ్
కేంద్రమంత్రి అరుణ్ జైట్లీ కాన్వాయ్ కనిపించకపోవడంతో అధికారులకు ముచ్చెమటలు పట్టాయి. కోల్ కతాలో జరిగిన ఈ సంఘటన వివరాలు... ఇటీవల మృతి చెందిన బీసీసీఐ మాజీ అధ్యక్షుడు జగన్మోహన్ దాల్మియా కుటుంబ సభ్యులను పరామర్శించేందుకు శనివారం ఢిల్లీ నుంచి వచ్చిన కేంద్రమంత్రి అరుణ్ జైట్లీ కోల్ కతాలోని అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి బయలుదేరారు. మంత్రి కాన్వాయ్, మిగిలిన వాహనాలు మాత్రం ముందుగా సూచించిన మార్గంలో వెళ్లగా మంత్రి ప్రయాణిస్తున్న వాహనం మాత్రం ఏజేసీ రోడ్ ఫ్లైఓవర్ దగ్గర దారి మళ్లింది. దీంతో అధికారులు కంగారుపడ్డారు. కేంద్రమంత్రి సెక్యూరిటీ అధికారులు, కోల్ కతా పోలీసుల మధ్య సమాచార లోపం తలెత్తడంతోనే ఈ ఘటన చోటు చేసుకున్నట్లు సమాచారం. అయితే మంత్రి కారు రాజ్ భవన్ కు చేరుకుందన్న సమాచారం తెలుసుకున్న భద్రతాధికారులు ఊపిరి పీల్చుకున్నారు. అనంతరం అక్కడి నుంచి దాల్మియా నివాసానికి జైట్లీ వెళ్లారు. ఈ సంఘటనపై సిటీ పోలీస్ స్పెషల్ బ్రాంచ్ ఆఫీసర్ మాట్లాడుతూ మంత్రి కాన్వాయ్ కి ఉన్న జామర్ కారణంగా సమాచార లోపం తలెత్తి ఉండవచ్చని చెప్పారు.