: భర్తల కంటే భార్యలే ధనవంతులు...ఇదే ‘నారా’ వారి గతేడాది ఆస్తుల చిట్టా
టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు ఇంటిలో పురుషుల కంటే మహిళల పేరిటే ఎక్కువ ఆస్తులు ఉన్నాయి. గతేడాది చంద్రబాబునాయుడు స్వయంగా ప్రకటించిన ఆస్తుల చిట్టా ఇదే విషయాన్ని వెల్లడిస్తోంది. చంద్రబాబు పేరిట రూ.71 లక్షల ఆస్తులు మాత్రమే ఉన్నాయి. ఇక చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి పేరిట ఏకంగా రూ.31 కోట్ల మేర ఆస్తులున్నాయి. హెరిటేజ్ గ్రూపు సంస్థల చైర్మన్ హోదాలో ఉన్న భువనేశ్వరే చంద్రబాబు కుటుంబంలో అత్యంత సంపన్నురాలు. ఇక చంద్రబాబు కుమారుడు నారా లోకేశ్ పేరిట గతేడాది రూ.3.57 కోట్ల మేర ఆస్తులున్నాయి. లోకేశ్ సతీమణి నారా బ్రాహ్మణి పేరిట మాత్రం ఆయన కంటే కాస్త అధికంగా రూ.3.96 కోట్ల ఆస్తులున్నాయి. అంటే లోకేశ్ దంపతుల్లోనూ మహిళే కాస్తంత ధనవంతురాలన్న మాట. వెరసి చంద్రబాబు కుటుంబంలో గతేడాది ఇద్దరు పురుషులు, ఇద్దరు మహిళలుంటే... వారిలో మహిళలే పురుషుల కంటే సంపన్నులుగా ఉన్నారు. తాజాగా లోకేశ్ తన కుటుంబ ఆస్తులను కాసేపట్లో ప్రకటిస్తున్నారు. మరి ఈ ఏడాది పరిస్థితి ఎలా ఉంటుందో చూడాలి.