: వార్డర్లపై దాడి చేసి, జైలర్ ను బందీగా చేసుకుని...చెన్నై జైల్లో ‘ఉగ్ర’ ఖైదీల హల్ చల్


తమిళనాడు రాజధాని చెన్నై శివారులోని అత్యంత కట్టుదిట్టమైన భద్రత కలిగిన పుళల్ సెంట్రల్ జైలు నిన్న రాత్రి రణరంగంగా మారింది. బంధువులు తెచ్చిన ఆహారాన్ని అనుమతించలేదని ఆందోళనకు దిగిన ఖైదీలు ముగ్గురు వార్డర్లను చితకబాదారు. అడ్డొచ్చిన మరో వార్డర్ సహా జైలర్ ను తమ బ్యారక్ లో బందీలుగా చేసుకున్నారు. దీంతో నిన్న రాత్రి చెన్నైలో పోలీసు వర్గాలు ఉరుకులు పరుగులు పెట్టాయి. వివరాల్లోకెళితే... చెన్నై సహా తమిళ నగరాలు కోయంబత్తూరు, మరికొన్ని ప్రాంతాల్లోని దేవాలయాలే లక్ష్యంగా దాడులకు పాల్పడ్డ ఆల్-ఉమా ఉగ్రవాద సంస్థ కీలక నేత ఫక్రూద్దీన్ సహా అతడి అనుచరులను అరెస్ట్ చేసిన పోలీసులు పుళల్ జైలుకు తరలించారు. ఈ క్రమంలో నిన్న ఫక్రూద్దీన్ బంధువులు అతడికి ఇంటి నుంచి ఆహారం తెచ్చారు. అయితే దీనిని జైలు అధికారులు అనుమతించలేదు. దీంతో ఫక్రూద్దీన్ తన అనుచరులతో కలిసి జైల్లోనే ఆందోళనకు దిగాడు. ఈ క్రమంలో వారి వద్దకు వచ్చిన వార్డర్లు ముత్తుమణి, రవి మోహన్, సెల్విన్ దేవదాస్ లపై ఫక్రూద్దిన్ గ్యాంగ్ మూకుమ్మడి దాడికి పాల్పడింది. ఈ దాడిలో ముగ్గురు వార్డర్లకు తీవ్ర గాయాలయ్యాయి. అంతటితో ఆగని ఫక్రూద్దీన్ గ్యాంగ్ జైలర్ తో పాటు మరో వార్డర్ ను బందీగా పట్టుకుని తమ బ్యారక్ లోకి వెళ్లారు. సమాచారం తెలుసుకున్న పోలీసు ఉన్నతాధికారులు అక్కడికి చేరుకుని ఎట్టకేలకు నాలుగు గంటల తర్వాత జైలర్, వార్డర్ కు ఫక్రూద్దీన్ నిర్బంధం నుంచి విముక్తి కల్పించారు.

  • Loading...

More Telugu News