: ఊహించని పరిణామం... నజీబ్ జంగ్ కు కితాబిచ్చిన కేజ్రీవాల్


రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఎవరూ ఉండరని అంటుంటారు. ఇది నిజమే అని నిరూపించే మరో ఘటన సంభవించింది. ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్, ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ఇద్దరూ ఉప్పు, నిప్పులా ఉంటారన్న విషయం తెలిసిందే. వీరిద్దరి మధ్య వైరం దేశ వ్యాప్తంగా చర్చల్లో ఉంటుంది. అలాంటిది, ఊహించని విధంగా నజీబ్ జంగ్ కు కేజ్రీవాల్ కితాబిచ్చారు. నజీబ్ జంగ్ చాలా మంచి వారంటూ పొగిడారు. కాకపోతే అతనికి సలహాలిస్తున్న రాజకీయ గురువులే మంచి వారు కాదని విమర్శించారు. జంగ్ ను లెఫ్టినెంట్ గవర్నర్ పదవి నుంచి తొలగించాలని బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు డిమాండ్ చేస్తుండటం ఆశ్చర్యాన్ని కలిగిస్తోందని ఆయన అన్నారు. వ్యక్తిగతంగా జంగ్ చేస్తున్న తప్పేమీ లేదని... కేవలం ప్రధాని కార్యాలయం ఆదేశాలను ఆయన అనుసరిస్తున్నారంతే అని ట్వీట్ చేశారు. జంగ్ తర్వాత పదవిని చేపట్టే మరో వ్యక్తి కూడా పీఎంవో కనుసన్నల్లోనే నడుస్తారని చెప్పారు. లెఫ్టినెంగ్ గవర్నర్ విధుల్లో ప్రధాని కార్యాలయం జోక్యం చేసుకోవడం ఆగితే... ఢిల్లీ సమస్యలన్నీ పరిష్కారమవుతాయని అన్నారు.

  • Loading...

More Telugu News