: మా దీక్షపై మళ్లీ హైకోర్టును ఆశ్రయిస్తాం: పెద్దిరెడ్డి
గుంటూరులో రేపు జరగబోయే వైఎస్ జగన్ దీక్షను వాయిదా వేసినట్టు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. కోర్టు అనుమతి వచ్చే వరకూ దీక్ష వాయిదా వేస్తున్నట్టు చెప్పారు. నిరాహార దీక్షను అడ్డుకోవడం దురదృష్టకరమని, తమ దీక్షపై మళ్లీ హైకోర్టును ఆశ్రయిస్తామని అన్నారు. జగన్ దీక్ష పిటిషన్ ను విచారణకు తీసుకునేందుకు హైకోర్టు తిరస్కరించిన నేపథ్యంలో వైసీపీ నేతలు హైదరాబాదులోని పార్టీ కార్యాలయంలో సమావేశమయ్యారు. అనంతరం పెద్దిరెడ్డి మాట్లాడుతూ, గతంలో రెండుసార్లు చంద్రబాబు కూడా దీక్షలు చేశారు కదా? అని ప్రశ్నించారు. మీడియాకు చంద్రబాబు యక్ష ప్రశ్నలు వేయడం చూస్తుంటే జగన్ దీక్ష పట్ల ఆయనకు భయం పట్టుకున్నట్టుందని వ్యాఖ్యానించారు. కోర్టు తమకు రెగ్యులర్ ఫాంలో రావాలని సూచించిందని పెద్దిరెడ్డి వివరించారు. నిరాహార దీక్ష చేయడం నేరం కాదని, కోర్టు అనుమతి ఇస్తుందని ఆశిస్తున్నామని ఆయన అన్నారు. రామోజీరావును జగన్ కలవడంలో తప్పేముందన్నారు.