: తమ వద్ద ఉన్న నల్లధనం గుట్టు విప్పిన 29 మంది భారతీయులు
స్వచ్ఛందంగా తమ వద్ద ఉన్న నల్లధనం వివరాలను వెల్లడించి జరిమానా, జైలు శిక్షను తప్పించుకునేందుకు మరో ఆరు రోజులు మాత్రమే సమయం మిగిలివుండగా, ఇప్పటివరకూ కేవలం 29 మంది మాత్రమే తాము దాచుకున్న బ్లాక్ మనీ వివరాలు తెలిపారు. వీరి వద్ద దాదాపు రూ. 2 వేల కోట్లకు పైగా నల్లధనం ఉందని ఆదాయపు పన్ను శాఖ అధికారులు వివరించారు. కాగా, జూలై 1న 'తప్పు ఒప్పుకుని నల్లధనం వివరాల వెల్లడి' స్కీం ప్రారంభం కాగా, హెచ్ఎన్ఐ (హై నెట్ వర్త్ ఇన్డివిడ్యువల్)లకు వున్న అనుమానాలను నివృత్తి చేయడంలో విఫలమైనందునే ఈ స్కీంకు పెద్దగా స్పందన రాలేదని అధికారులు భావిస్తున్నారు. ఇటీవలే ధనికుల నుంచి వచ్చే సమాచారాన్ని పూర్తి రహస్యంగా ఉంచుతామని, వారి పేర్లను ఎట్టి పరిస్థితుల్లో బయట పెట్టబోమని, వారిపై విచారణ, వేధింపులు ఉండవని కేంద్రం స్పష్టత ఇచ్చినా, బ్లాక్ మనీని బహిర్గతం చేసేందుకు ఎవరూ ముందుకు రావట్లేదు. ఈ 29 మంది పేర్లను సైతం బయటపెట్టబోమని, వీరి వివరాలు అతి కొద్ది మందికి మాత్రమే తెలుసునని ఆర్థిక శాఖ ఉన్నతోద్యోగి ఒకరు వివరించారు.