: మావోయిస్టులను చంపడమే సీఎం కేసీఆర్ అజెండానా?: చాడ వెంకట్ రెడ్డి
ఇటీవల వరంగల్ జిల్లా అటవీప్రాంతంలో జరిగిన మావోయిస్టుల ఎన్ కౌంటర్ పై సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి మండిపడ్డారు. ఈ ఘటనపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ను సూటిగా ప్రశ్నించారు. మావోయిస్టుల అజెండానే తమ అజెండా అన్న కేసీఆర్ కు... వారిని చంపడమే అజెండానా? అని నిలదీశారు. గత పాలకులకు, కేసీఆర్ పాలనకు ఏమాత్రం తేడా లేదన్నారు. పోలీసులకు అత్యాధునిక వాహనాలు సమకూర్చింది ప్రజలను రక్షించడానికా? లేక చంపడానికా? అని కరీంనగర్ లో ప్రశ్నించారు. ప్రభుత్వ ఆగడాలకు బ్రేకులు వేసేందుకు తెలంగాణ ప్రజాస్వామిక వేదికను ఏర్పాటు చేశామని తెలిపారు. ఈ నెల 30న చలో అసెంబ్లీ చేపడతామని, 29న వరంగల్ లో పార్లమెంటు ఉపఎన్నికలపై వామపక్ష పార్టీల సమావేశం నిర్వహించి పోటీచేసే అభ్యర్థిని నియమిస్తామని చాడ వివరించారు. నిత్యావసర వస్తువుల ధరలను నియంత్రించాలంటూ అక్టోబర్ 2న అన్ని జిల్లాల కలెక్టరేట్లను ముట్టడిస్తామని పేర్కొన్నారు.