: బాలీవుడ్ సినిమా ప్రివ్యూ చూసి ఎంజాయ్ చేసిన టీమిండియా క్రికెటర్లు
‘సఫారీ’లతో త్వరలో ప్రారంభం కానున్న సుదీర్ఘ సిరీస్ కోసం టీమిండియా క్రికెటర్లు చెమటోడుస్తున్నారు. ఇప్పటికే వన్డే, టీ20 జట్లను బీసీసీఐ ప్రకటించింది. దీంతో మైదానంలోకి దూకేసిన క్రికెటర్లు కఠోర సాధన చేస్తున్నారు. రెండు ఫార్మాట్ల కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీతో పాటు వైస్ కెప్టెన్ విరాట్ కోహ్లీ సహా జట్టుకు ఎంపికైన సభ్యులంతా బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో జరుగుతున్న ప్రాక్టీస్ సెషన్లకు క్రమం తప్పకుండా హాజరవుతున్నారు. అయితే నిన్న జట్టు సభ్యులందరూ కాస్తంత విశ్రాంతి తీసుకున్నారు. ‘కామెడీ నైట్స్ విత్ కపిల్’ టీవీ షోతో సెలబ్రిటీగా మారిన కపిల్ శర్మ ప్రధాన పాత్రధారిగా బాలీవుడ్ లో ‘కిస్ కిస్ సే ప్యార్ కరూ’ చిత్రం రూపొందింది. ఈ చిత్రం నిర్మాణం పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధంగా ఉంది. నిన్న బెంగళూరులో టీమిండియా క్రికెటర్ల కోసం చిత్ర నిర్మాతలు ఈ చిత్రం ప్రివ్యూను ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. ధోనీ సహా మిగిలిన క్రికెటర్లంతా ఈ సినిమాను చూసి బాగా ఎంజాయ్ చేశారు.