: తాను మరణిస్తూ ముగ్గురి ప్రాణాలు నిలిపిన 'యువరైతు'
అవయవదానం కింద తొలిసారి తిరుపతి స్విమ్స్ నుంచి ఓ వ్యక్తి గుండె చెన్నై ప్రయాణించింది. మద్రాస్ మెడికల్ మిషన్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న పంజాబ్ కు చెందిన ఓ రోగికి ఈ గుండెను అమర్చారు. ఆ వివరాల్లోకి వెళితే, నెల్లూరు జిల్లా గుర్రంకొండ మండలం చెర్లోపల్లెకు చెందిన యువరైతు రెడ్డప్పరెడ్డి(30) రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు. తిరుపతి స్విమ్స్ లో చికిత్స పొందిన ఆయనను బ్రెయిన్ డెడ్ గా వైద్యులు ప్రకటించారు. దాంతో తీవ్ర విషాదంలో మునిగిన కుటుంబ సభ్యులకు అవయవదానం గురించి చెప్పారు. ఇతని అవయవాలతో ఇతరుల ప్రాణాలు నిలపవచ్చని ఆలోచించిన కుటుంబ సభ్యులు అంతటి విషాదంలోనూ అవయవదానానికి అంగీకరించారు. మెడికల్ సూపరింటెండెంట్ సత్యనారాయణ చెన్నైలోని మద్రాస్ మెడికల్ మిషన్ డాక్టర్లుకు ఈ విషయాన్ని చెప్పారు. వెంటనే స్విమ్స్ కు వచ్చిన వారు గంటలో ఆపరేషన్ చేసి గుండె, రెండు కిడ్నీలు వేరు చేశారు. ఆ గుండెను తీసుకెళ్లెందుకు ప్రత్యేక విమాన సదుపాయం లేకపోవడంతో రోడ్డు మార్గాన చెన్నైకి తీసుకువెళ్లాలని నిర్ణయించుకున్నారు. ఈ విషయంపై తిరుపతి అర్బన్, జిల్లా ఎస్పీలతో మాట్లాడగా, చెన్నైకి వెళ్లే మార్గంలో ట్రాఫిక్ క్లియరెన్స్ ఇచ్చారు. తమిళనాడు సరిహద్దు వరకు ట్రాఫిక్ పోలీసులే సహాయ సహకారాలు అందించారు. ఇక తమిళనాడులో అక్కడి పోలీసులు ట్రాఫిక్ క్లియరెన్స్ చేశారు. దాంతో రెండు గంటల్లో చెన్నైకి చేరుకున్న ఈ గుండె మరో రోగి ప్రాణాలు కాపాడింది. ఇక రెండు కిడ్నీల్లో ఒకదానిని నెల్లూరులోని నారాయణ ఆసుపత్రి యూరాలజిస్ట్ డాక్టర్ సూర్యప్రకాష్ కు అందజేయగా, మరొకదాన్ని స్విమ్స్ లో ఒక పేద రోగికి అమర్చనున్నారు. ఇలా ఆ యువరైతు తాను మరణించినప్పటికీ, ముగ్గురికి ప్రాణదానం చేయడం వల్ల, వారిలో జీవిస్తున్నాడు.