: నరేంద్ర మోదీతో లాభం లేదన్న ఎల్అండ్ టీ చైర్మన్
నిర్మాణ రంగ దిగ్గజం లార్సెన్ అండ్ టూబ్రో (ఎల్అండ్ టీ) చైర్మన్ ఎఎం నాయక్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇండియాలో ఆర్థిక వృద్ధి ఎంతమాత్రమూ సంతృప్తికరంగా లేదని, ప్రధాని నరేంద్ర మోదీ సంస్కరణల అజెండా కీలక రంగాలను ఉత్తేజ పరచడంలో విఫలమైందని ఆయన ఆరోపించారు. ముఖ్యంగా మౌలిక, ఇంజనీరింగ్, నిర్మాణ రంగాల వ్యాపారం దేశంలో మందగించిందని, క్షేత్ర స్థాయిలో ఆర్థిక వృద్ధి జరగడం లేదని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రపంచంలోనే అత్యధిక వృద్ధిని నమోదు చేస్తూ, శరవేగంగా ఎదుగుతున్న దేశాల్లో చైనాతో సమానంగా నిలిచిన భారత్, మూలధన పెట్టుబడుల విషయంలో అనుకున్నంత ఫలితాలు రాబట్టడంలో విఫలం కావడం ఆందోళన కలిగిస్తోందని నాయక్ వ్యాఖ్యానించారు. ప్రైవేటు రంగంలో పెట్టుబడుల కోసం కార్పొరేట్ కంపెనీలు యుద్ధం చేయాల్సి వస్తోందని, కొత్తగా రైలు, రోడ్డు ప్రాజెక్టులను కేంద్రం చేపట్టినా ఈ కంపెనీల రుణభారం పెరుగుతోందని ఆయన వివరించారు. మోదీ ప్రారంభించిన 'మేకిన్ ఇండియా'కు సహకరించాలని తాము భావిస్తుంటే, అందుకు తగ్గ ఆర్డర్లు రావట్లేదని అన్నారు. టెండర్ల దశలోనే ఎన్నో జాతీయ రహదారుల ప్రాజెక్టులు ఆగిపోతే, రోజుకు 30 కిలోమీటర్ల రోడ్లను నిర్మిస్తున్నామని ఎలా ప్రచారం చేసుకుంటున్నారని నాయక్ ప్రశ్నించారు.