: తిరుమలలో సంచలనం... ఆలయం ముందు మత్తు మందిచ్చి దోపిడీ
తిరుమలలో ఇద్దరు మహిళా భక్తుల నుంచి నగలు దోచుకున్న సంఘటన సంచలనం సృష్టించింది. వివరాల్లోకి వెళితే, తమిళనాడుకు చెందిన మహిళలు బ్రహ్మోత్సవాల ఆఖరి రోజు తిరుమలకు వచ్చారు. స్వామివారి చక్రస్నానం అనంతరం ఆలయం పక్కనే వున్న అన్నదాన కేంద్రం వద్దకు వెళ్లారు. అక్కడ కొందరు గుర్తు తెలియని దుండగులు మత్తు మందు కలిపిన కాఫీని వారికి అమ్మారు. దీంతో ఆ మహిళలకు మగత కమ్మగా, వారిని అక్కడి నుంచి కౌస్తుభం వసతి గృహ సముదాయాల వరకూ తీసుకెళ్లారు. వారి వద్ద వున్న బంగారు నగలన్నీ దోచుకున్నారు. కాసేపటికి తెలివి తెచ్చుకున్న వారు తాము మోసపోయామని గమనించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ తరహా ఘటనలు తిరుమలలో అత్యంత అరుదు. దీంతో కేసును సీరియస్ గా తీసుకున్న పోలీసులు సీసీ కెమెరాల దృశ్యాలను విశ్లేషించే పనిలో ఉన్నారు.