: కీచకుల బారి నుంచి తప్పించుకునేందుకు ప్రాణాలు పణంగా పెట్టారు
కీచకుల బారి నుంచి తప్పించుకునేందుకు ఓ దంపతులు తమ పది నెలల కుమారుడితో కలసి కదులుతున్న రైళ్లోంచి దూకేసిన ఘటన పశ్చిమ బెంగాల్ లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే... ఉత్తరప్రదేశ్ లోని ఇటుక బట్టీల్లో కూలీలుగా పని చేసుకునే దంపతులు పది నెలల కుమారుడితో పశ్చిమ బెంగాల్ లోని కుచ్ బెహరా జిల్లాలోని దిన్ హతాకు బయల్దేరారు. వీళ్లు ఎక్కిన బోగీలోనే 12 మంది యువకుల బృందం కూడా ప్రయాణిస్తోంది. ప్రయాణం మొదలైన దగ్గర్నుంచి వేధిస్తున్న యువకుల ఆగడాలను ఆ దంపతులు న్యూహసీమరా రైల్వే స్టేషన్ లో రైల్వే పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు. స్టేషన్ లో తగినంత సిబ్బంది లేరని, తరువాత వచ్చే అలీ పుర్ద్వారా స్టేషన్ లో ఫిర్యాదు చేయాలని పోలీసులు బాధితులకు సూచించారు. దీంతో చేసేది లేక బాధితులు మళ్లీ రైలెక్కారు. పోలీసులు పట్టించుకోకపోవడంతో యువకులు మరింత రెచ్చిపోయారు. సిిలిగురి స్టేషన్ లో జీఆర్పీ పోలీసులు సహా ప్రయాణికులంతా దిగిపోయారు. దీంతో ట్రైన్ భట్కావా స్టేషన్ దాటిన అనంతరం భర్తను గట్టిగా పట్టుకుని, మహిళపై అత్యాచారయత్నం చేశారు. ప్రాణభయంతో బెంబేలెత్తిన బాధితులు ఎలాగోలా విడిపించుకుని తమ పది నెలల కుమారుడితో కలసి కదులుతున్న రైలులోంచి దూకేశారు. తీవ్ర గాయాలతో రెండు కిలోమీటర్లు నడిచి భట్కావా స్టేషన్ కు చేరుకుని పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు వారిని ఆలీపుర్ద్వారా రైల్వే ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. నిందితుల కోసం గాలిస్తున్నట్టు పోలీసులు తెలిపారు.