: పారిపోయాడంటున్న పోలీసులు, బంధించారంటున్న లాయర్లు... హార్దిక్ పటేల్ ఎక్కడ? గుజరాత్ లో టెన్షన్!


గుజరాత్ లో పటేల్ కమ్యూనిటీ కోసం రిజర్వేషన్లు ఇవ్వాల్సిందేనని జరుగుతున్న ఆందోళనకు నేతృత్వం వహిస్తున్న హార్దిక్ పటేల్ కనిపించడం లేదు. ఆయన్ను పోలీసులు చట్ట విరుద్ధంగా అరెస్ట్ చేశారని ఆరోపిస్తూ, కొందరు న్యాయవాదులు గత అర్ధరాత్రి గుజరాత్ హైకోర్టును ఆశ్రయించగా, వెంటనే ఆయన్ను కోర్టు ముందు హాజరు పరచాలన్న ఉత్తర్వులు రాత్రి 2:30 గంటల సమయంలో వెలువడ్డాయి. ఎట్టి పరిస్థితుల్లోను ఆయనను నేడు కోర్టు ముందుంచాలని న్యాయమూర్తి గుజరాత్ పోలీసు శాఖను ఆదేశించారు. అయితే, హార్దిక్ ను తాము అరెస్ట్ చేయలేదని, ఆరావళీ జిల్లాలో ఆయన్ను అదుపులోకి తీసుకునే ప్రయత్నం చేయగా, తమ కళ్లు గప్పి పారిపోయారని పోలీసులు చెబుతున్నారు. మరోవైపు హార్దిక్ ఎక్కడున్నారన్న విషయం ఆయన దగ్గరి మిత్రులు, పటేల్ నేతలకు సైతం తెలియకపోవడంతో గుజరాత్ లో తీవ్ర ఆందోళన నెలకొంది. ప్రస్తుతం హార్దిక్ ఎక్కడున్నారో తెలియదని, ఆయన సమాచారం కోసం ప్రయత్నిస్తున్నామని న్యాయవాది బీఎం మంగూకియా వ్యాఖ్యానించారు. మరోవైపు పోలీసులు సైతం ఆయన కోసం గాలిస్తున్నారు. అనుమతి లేకుండా సమావేశాలు నిర్వహిస్తున్నారన్న ఆరోపణలపై నిన్న హార్దిక్ సహా 13 మందిపై కేసులు నమోదైన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News