: చంద్రబాబుకు ఆడపిల్లలు లేరు గనుకే విలువ తెలియడం లేదు: ఎమ్మెల్యే రోజా


ఆంధ్రప్రదేశ్ లో మహిళల రక్షణకు ప్రభుత్వం సరైన చర్యలు తీసుకోవడం లేదంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రోజా మండిపడ్డారు. నాగార్జున విశ్వవిద్యాలయంలో ఆత్మహత్యకు పాల్పడిన బీఆర్క్ విద్యార్థిని రిషితేశ్వరి కేసును ప్రభుత్వం సీరియస్ గా తీసుకోలేదన్నారు. కఠినంగా వ్యవహరించి ఉంటే ఇవాళ విజయవాడలోని స్టెల్లా కళాశాలలో ఇంటర్ విద్యార్థిని భానుప్రీతి ఆత్మహత్యకు చేసుకునేదా? అని రోజా ప్రశ్నించారు. హైదరాబాదులోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. సీఎం చంద్రబాబుకు ఆడపిల్లలు లేరు కాబట్టే వారి విలువ ఏమిటో ఆయనకు తెలియడంలేదని ఆమె అన్నారు. అందుకే రాష్ట్రంలో మహిళలపై దౌర్జన్యాలు జరుగుతున్నా, ఆడపిల్లలు ఆత్మహత్యలకు పాల్పడుతున్నా చర్యలు తీసుకోవడం లేదని మండిపడ్డారు. ఇవేమీ పట్టించుకోకుండా సింగపూర్, మలేషియా అంటూ విదేశాలలో సీఎం విలాసాలు చేస్తున్నారని రోజా ధ్వజమెత్తారు. రాష్ట్రంలో పలువురు విద్యార్థులు, మహిళల ఆత్మహత్యలపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకు జిల్లాల్లో సైకో సూదిగాడిలా టీడీపీ నేతలు మారారని వ్యాఖ్యానించారు. ఇక మహిళ ఎమ్మార్వో వనజాక్షిపై అందరు చూస్తుండగానే టీడీపీ ఎమ్మెల్యే దాడి చేస్తే మంత్రివర్గంలో ముగ్గురు మహిళలున్నా స్పందించలేదని ఆరోపించారు.

  • Loading...

More Telugu News