: ఢిల్లీలో చేయాల్సిన పనిని జగన్ గల్లీలో చేస్తున్నారు: ఎమ్మెల్సీ గాలి ముద్దుకృష్ణమ
ప్రత్యేక హోదాపై అవగాహన అంటూ 'యువభేరి' పేరుతో తిరుపతిలో, నేడు విశాఖలో విద్యార్థులతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి సదస్సులు నిర్వహించడాన్ని టీడీపీ ఎమ్మెల్సీ గాలి ముద్దుకృష్ణమ నాయుడు తప్పుబట్టారు. యువభేరి పేరుతో జగన్ విద్యార్థులను రెచ్చగొడుతున్నారని మండిపడ్డారు. అసలు జగన్ ఢిల్లీలో చేయాల్సిన పనిని గల్లీలో చేస్తున్నారని ఎద్దేవా చేశారు. వైసీపీకి 8 మంది ఎంపీలున్నారని, రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం పార్లమెంట్ లో పోరాడాలని గాలి సూచించారు. ఈ విషయంలో సీఎం చంద్రబాబుపై జగన్ ఆరోపణలు చేయడం సరికాదన్నారు. కేంద్ర ప్రభుత్వం హోదా ఇస్తే చంద్రబాబు తప్పకుండా తీసుకునే వారని వ్యాఖ్యానించారు. కానీ తన సొంత పత్రిక, ఛానల్ ద్వారా ప్రభుత్వంపై జగన్ దుష్ప్రచారం చేయిస్తున్నారని ఆరోపించారు.