: ఎంతైనా, ఎంతసేపైనా సరే.. 'అందం' కోసం పరితపిస్తున్న భారతీయ మహిళలు
మన దేశంలో అమ్మాయిలు, మహిళలు తమ అందంపై ఎక్కువ శ్రద్ధే కనపరుస్తున్నారు. అందుకోసం సమయం, డబ్బు ఎక్కువగానే కేటాయిస్తున్నారు. ఇంట్లో నుంచి ఎక్కడికీ కదలకుండా, సంప్రదాయ పద్ధతుల్లో సౌందర్య సాధనాలను ఉపయోగించి తమ అందానికి మరింత మెరుగులు దిద్దుకుంటున్న వారు కొందరు... అలా కాకుండా ఉన్నత శ్రేణి బ్యూటీ సెలూన్లకు వెళ్లి అధునాతన సౌందర్య సాధనాలను విని యోగిస్తున్న అమ్మాయిలు, మహిళలు మరికొందరు ఉన్నారు. ముఖ్యంగా మెట్రో నగరాల విషయానికొస్తే... ముంబయి, బెంగళూరులో ఉన్న ఉన్నత శ్రేణి బ్యూటీ సెలూన్లకు క్రమం తప్పకుండా వెళ్లే వారు ఉన్నారు. గతంలో అయితే రెండు, మూడు నెలలకు ఒకసారి వెళుతుండేవారట. కానీ, నెలలోనే రెండుసార్లు సెలూన్ కు తప్పనిసరిగా వెళ్లి తమ అందానికి మెరుగులు దిద్దుకుంటున్నారుట. హెయిర్ స్టైలింగ్, నెయిల్ పాలిష్ వంటి వాటిపై టీనేజ్ అమ్మాయిలతో పాటు 25 సంవత్సరాల పైబడిన మహిళలు కూడా తమ సెలూన్లకు తరచుగా వస్తున్నారంటూ వాటి నిర్వాహకులు చెబుతున్నారు. ఫ్రెంచ్ సెలూన్ల శ్రేణికి చెందిన జీన్-క్లాద్ బిగ్విన్ (జేసీబీ) సెలూన్ ఒకటి ముంబయిలో ఉంది. దేశ రాజధాని అయిన ఢిల్లీలో కూడా ఇలాంటి సెలూన్ ఇంత వరకూ ఏర్పాటు చేయలేదు. ఇక్కడికి వచ్చే వాళ్లలో సరాసరి రూ.10,000 ఖర్చు చేసే వాళ్లు ఉన్నారు. మొబైల్ వినియోగదారుల విషయానికొస్తే ఢిల్లీ నుంచి ఫ్లైట్ లో ముంబయిలోని ఈ సెలూన్ కు వెళ్లే వారూ ఉన్నారు. అందుకనే, భారతదేశంలో బ్యూటీ సెలూన్ల వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగడమే కాదు... ఊహించని స్థాయిలో పుంజుకుంటోంది. వినియోగదారులు బ్యూటీ సెలూన్లకు ఒక నెలలో సుమారు 2-3 సార్లు వెళుతున్నారు. ఈ సంఖ్య ప్రపంచ సరాసరికి చాలా దగ్గరగా ఉంది. ఇక్కడికి వచ్చే వినియోగదారుల ఆదాయాలు పెరుగుతుండటం కూడా వారు తరచుగా ఇక్కడికి రావడానికి ఒక కారణంగా చెప్పవచ్చని నిర్వాహకులు అంటున్నారు. మధ్య స్థాయి నుంచి ప్రీమియం బ్యూటీ సెలూన్లలో హెయిర్ కట్ చేసి తలకు రంగు వేస్తే సుమారు రూ.2,000 నుంచి రూ.5,000 వరకు తీసుకుంటున్నారు. గత ఐదేళ్లలో, వినియోగదారులు తమ జుట్టు గురించి శ్రద్ధ కోసం రెట్టింపు ఖర్చుచేస్తున్నారు. విదేశీయానాలు చేసే వినియోగదారులైతే అంతర్జాతీయ సౌందర్య సాధనాలపై ఎక్కువగా మోజు కనపరుస్తున్నారు. విభిన్నంగా కనపడేందుకు మహిళలు పలు రకాల ప్రయోగాలు చేస్తుంటారని జేసీబీ ఇండియా, సీఈఓ, సమీర్ శ్రీ వాస్తవ పేర్కొన్నారు.