: సోప్ ప్రకటన వివాదంలో నటుడు మమ్ముట్టి... సమన్లు జారీ చేసిన కోర్టు
ప్రముఖ నటుడు మమ్ముట్టి ఇటీవల 'ఇందులేఖ' వైట్ సోప్ అనే ప్రకటనలో నటించారు. తాజాగా ఈ ప్రకటన ఆయనను వివాదంలో పడేయడమే కాకుండా కోర్టు వరకు కూడా లాగింది. ఈ సోప్ వాడిన తనకు సంతృప్తికరమైన ఫలితాలు ఇవ్వలేదంటూ కేరళకు చెందిన కే.ఛాతు అనే శిల్పకారుడు కన్జ్యూమర్ కోర్టు (వినియోగదారుల న్యాయస్థానం) లో పిటిషన్ వేశాడు. ఇటువంటి అసత్య ప్రచార ప్రకటనల్లో ప్రముఖులు నటించడం ఆపేయాలంటూ ఛాతు ఫిర్యాదులో తెలిపాడు. విచారించిన కోర్టు సోప్ కంపెనీకి, మమ్ముట్టికి ఈరోజు సమన్లు జారీ చేసింది. కాగా నోటీసులు మమ్ముటికి అందలేదని, కాబట్టి విచారణను వాయిదా వేయాలని మమ్ముట్టి తరపు లాయర్ కోర్టును కోరారు. అంగీకరించిన కోర్టు వచ్చే నెల 12కు విచారణ వాయిదా వేసింది.