: దివాలా తీసిన ఆమ్టెక్ ఆటో!
వాహన విడిభాగాలు తయారు చేస్తున్న ఆమ్టెక్ ఆటో దాదాపుగా దివాలా తీసినట్టే. మొత్తం రూ. 800 కోట్ల విలువైన బాండ్ల చెల్లింపులు చేయడంలో సంస్థ విఫలమైంది. ఈ సంస్థ బ్యాంకుల నుంచి గతంలో రూ. 8 వేల కోట్ల రుణాలను తీసుకోగా, వాటిని తిరిగి చెల్లించకపోవడంతో ఈ మొత్తాలను బ్యాంకులు ఇప్పటికే 'బ్యాడ్ లోన్స్'గా క్లాసిఫైడ్ చేశాయి. ఇదే సమయంలో సోమవారం నాటితో బాండ్ల మెచ్యూరిటీ తీరింది. ఈ చెల్లింపుల విషయంలోనూ ఆమ్టెక్ విఫలం కావడంతో ఇక సంస్థ దాదాపు దివాలా తీసినట్టేనని పరిశ్రమ వర్గాలు వ్యాఖ్యానించాయి. కాగా, ఈ సంస్థ జేపీ మోర్గాన్ సహా పలు కంపెనీలకు సుమారు రూ. 1000 కోట్ల వరకూ చెల్లించాల్సి వుంది. ఈ విషయమై సంస్థ చైర్మన్ అరవింద్ ధామ్ ను వివరణ కోరగా, కొన్ని సమస్యల్లో ఉన్నమాట వాస్తవమేనని, బ్యాంకులతో చర్చిస్తున్నామని తెలిపారు. సమస్యను పరిష్కరించుకునేందుకు బ్యాంకర్లతో నిత్యమూ మాట్లాడుతున్నామని వివరించారు. ఆమ్టెక్ ను ఆదుకునేందుకు కొత్త రుణాలను ఇచ్చేందుకు బ్యాంకర్లు ససేమిరా అంటున్నట్టు తెలుస్తోంది. దీంతో ఆస్తులమ్మి ఆప్పులు కట్టేలా, ఐపీ పెట్టడం మినహా సంస్థ ముందు మరో దారి కనిపించడం లేదు.