: రికార్డింగ్ డ్యాన్స్ ను అడ్డుకోబోయిన పోలీసులపై గ్రామస్థుల దాడి
వినాయక చవితిని పురస్కరించుకుని ఏర్పాటు చేసిన గణేశ్ మంటపం వద్ద జరుగుతున్న రికార్డింగ్ డ్యాన్స్ ను అడ్డుకోవడమే ఆ ఎస్సై చేసిన పొరపాటు. గ్రామస్థులంతా మూకుమ్మడిగా ఆ పోలీసు అధికారి, ఆయన వెంట వచ్చిన హోంగార్డుపై దాడి చేశారు. ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండలం పాకాలపల్లెపాలెంలో నిన్న రాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకెళితే... గ్రామంలోని గణేశ్ మంటపం వద్ద గ్రామస్థులు నిన్న రాత్రి హిజ్రాలతో రికార్డింగ్ డ్యాన్స్ ఏర్పాటు చేశారు. దీనిపై సమాచారం అందుకున్న ఎస్సై రమణయ్య, పలువురు కానిస్టేబుళ్లు, హోంగార్డు ఉపేంద్రను తీసుకుని డ్యాన్స్ ను అడ్డుకునేందుకు వెళ్లారు. పోలీసుల రాకను గమనించిన గ్రామస్థులు పోలీసు జీపుపై దాడి చేశారు. అంతేకాక ఎస్సై, హోంగార్డులపై గ్రామస్థులు మూకుమ్మడిగా దాడి చేశారు. ఈ దాడిలో ఎస్సైకి స్వల్ప గాయం కాగా, హోంగార్డు ఉపేంద్ర తలకు బలమైన గాయమే అయ్యింది. ఈ ఘటనతో మరిన్ని పోలీసు బలగాలు గ్రామానికి చేరుకున్నాయి. ప్రస్తుతం గ్రామంలో 144 సెక్షన్ ఆంక్షలను పోలీసులు విధించారు.