: నేడు సింగపూర్ పర్యటనకు చంద్రబాబు... రేపు, ఎల్లుండి రెండు రోజుల పాటు అక్కడే!
ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు నేటి రాత్రి సింగపూర్ బయలుదేరి వెళ్లనున్నారు. రేపు, ఎల్లుండి రెండు రోజుల పాటు సింగపూర్ లో పర్యటించేందుకు వెళుతున్న చంద్రబాబు వెంట ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు, మునిసిపల్ శాఖ మంత్రి నారాయణ, పలు శాఖల ఉన్నతాధికారులు సింగపూర్ బయలుదేరనున్నారు. నేటి రాత్రి శంషాబాదు అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి బయలుదేరనున్న చంద్రబాబు బృందం 23న తిరిగి హైదరాబాదు చేరుకుంటుంది. ఈ పర్యటనలో భాగంగా నవ్యాంధ్ర రాజధాని మాస్టర్ డెవలపర్ ఎంపికకు సంబంధించి అసెండాస్ కంపెనీ ఎండీతో చంద్రబాబు ప్రత్యేకంగా భేటీ కానున్నారు. ఇక అమరావతి నిర్మాణంపై సింగపూర్ మంత్రి ఈశ్వరన్ తోనూ చంద్రబాబు బృందం భేటీ అవుతుంది. వచ్చే నెల 22న జరగనున్న అమరావతి శంకుస్థాపనకు రావాల్సిందిగా చంద్రబాబు, సింగపూర్ ప్రధానిని ఆహ్వానించనున్నారు.