: నేతాజీ 'మిస్టరీ' గురించి ఏమీ తెలియని వారి కోసం ఎన్నో విషయాలివి!
సుభాష్ చంద్రబోస్... బ్రిటీష్ పాలకులను ఎదిరించి, వారిపై పోరాడేందుకు ప్రత్యేక సైన్యాన్నే సృష్టించిన దేశభక్తుడు. స్వాతంత్ర్యాన్ని కళ్ల చూడకుండానే విమాన ప్రమాదంలో మరణించారు. చరిత్రలో మనం నేర్చుకున్న పాఠం ఇదే. మరి, ఇది నిజమేనా? కాదని ఎన్నో వాదనలు దశాబ్దాలుగా వినిపిస్తూనే వున్నాయి. నిన్న విడుదలైన 64 రహస్య పత్రాలు ఆ వాదనకు ఊతమిచ్చేలా ఉన్నాయి. ఈ నేపథ్యంలో మనమంతా నేతాజీ అని పిలుచుకునే సుభాష్ చంద్రబోస్ గురించి ఏమీ తెలియని వారికోసం కొన్ని విషయాలు... * నేతాజీ మరణం భారతదేశ చరిత్రలోనే అతిపెద్ద మిస్టరీ. * ఆయనకు సంబంధించిన 64 ఫైళ్లు వెలుగులోకి వచ్చాయి. ఇంకా 130 ఫైళ్లు కేంద్రం వద్ద ఉన్నాయి. * ఆయన 1945లో అదృశ్యమయ్యారు. * అంతకుముందు కాంగ్రెస్ కు రెండుసార్లు అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ఆపై జవహర్ లాల్ నెహ్రూ, మహాత్మా గాంధీలతో అభిప్రాయభేదాలు వచ్చి దూరమయ్యారు. * పోరాడితేనే స్వాతంత్ర్యం వస్తుందని నమ్మి 'ఇండియన్ నేషనల్ ఆర్మీ'ని ప్రారంభించారు. * బ్రిటీష్ వారు అరెస్ట్ చేసి జైల్లో ఉంచారు కూడా. * 1941 ప్రాంతంలో ఆయన బ్రిటిష్ సైనికుల నుంచి మారువేషంలో తప్పించుకుని పెషావర్, ఆఫ్గనిస్థాన్, రష్యాల మీదుగా జర్మనీ వెళ్లారు. * ఆయన ప్రయాణిస్తున్న విమానం ఆగస్టు 18, 1945న కూలిపోయి, తీవ్ర గాయాలతో మరణించారని చెప్పగా, దీన్ని ఆయన అనుయాయులు, బంధువులు ఎవరూ నమ్మలేదు. * నేతాజీ కుటుంబీకులపై నెహ్రూ ప్రధానిగా ఉన్న సమయంలో పూర్తి నిఘా కొనసాగింది. * నేతాజీ బతికే ఉన్నాడని నెహ్రూ నమ్మబట్టే, తమపై దీర్ఘకాలంపాటు నిఘా ఉంచారన్నది ఆయన బంధువుల ప్రధాన ఆరోపణ. * నిన్న బహిర్గతమైన 64 సీక్రెట్ ఫైళ్లలో నెహ్రూ ప్రభుత్వం ఉంచిన నిఘాకు సంబంధించిన ఆధారాలు ఉన్నాయి. * నేతాజీ అదృశ్యమైన తరువాత ఎంతో కాలంపాటు ఆయన బతికే వున్నారని బంధువులు వాదిస్తున్నారు. * ఓ ఆధ్యాత్మిక గురువుగా 'గున్మామీ' పేరిట ఆయన ఫరీదాబాద్ లో ఉన్నారని, 1980లో మరణించారని ఓ వాదన వినిపిస్తుంటుంది. * భారత సైన్యం గురించి నేతాజీకి ఎంతో సమాచారం తెలుసు. ఆయన బహుభాషా కోవిదుడు కూడా. * ఆయన తిరిగి వస్తే తొలి ప్రతీకారం నెహ్రూపైనే తీర్చుకుంటాడని ఆయన బంధువులు భావిస్తుండేవారు. * ఈ విషయాలు కేంద్రం వద్ద ఉన్న ఫైళ్లలో ఉండటంతోనే 50 ఏళ్లకు పైగా సాగిన పాలనలో నేతాజీకి సంబంధించిన ఒక్క రహస్యమూ బయటకు రాలేదు. * మోదీ పదవీ బాధ్యతలు స్వీకరించగానే రహస్య ఫైళ్లు కదలడం గమనార్హం. * ఇక కేంద్రం దగ్గరున్న ఫైళ్లు బయటకు వస్తే నేతాజీ అదృశ్యంపై మరిన్ని వివరాలు లభిస్తాయని ఆయన అభిమానులు, సుభాష్ చంద్రబోస్ ను ఆరాధించే ఇండియన్స్ భావిస్తున్నారు.