: లాభాల్లో మార్కెట్లు ...సెన్సెక్స్ 200 పాయింట్ల అప్!
యూఎస్ ఫెడ్ వడ్డీ రేట్లను పెంచలేదన్న వార్తలతో ఒక దశలో 500 పాయింట్లకు పైగా లాభాల్లో నిలిచిన సెన్సెక్స్, చివరికి 202 పాయింట్ల లాభంతో సరిపెట్టుకుంది. యూరప్ మార్కెట్లు అంతంత మాత్రంగా ఉండటంతో మధ్యాహ్నం రెండు గంటల తరువాత అమ్మకాల ఒత్తిడి పెరగడమే లాభాలు తగ్గేందుకు కారణమయ్యాయని విశ్లేషకులు వ్యాఖ్యానించారు. ఇదే సమయంలో ఎన్బీఎఫ్సీ (నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీ)ల జాబితాలో చోటు సంపాదించుకోలేకపోయిన తెలంగాణ సంస్థ ఎస్కేఎస్ మైక్రోఫైనాన్స్ సంస్థ ఈక్విటీ విలువ 20 శాతం పడిపోయింది. దీంతో పాటు దివాన్ హౌసింగ్ ఫైనాన్స్ సంస్థ 6 శాతం నష్టపోయింది. ఆర్బీఐ మొత్తం 10 కంపెనీలకు ఎన్బీఎఫ్సీ లైసెన్సులు ఇవ్వగా, తమకు అనుమతి లభిస్తుందని ఆశలు పెట్టుకున్న ఈ రెండు కంపెనీల పేర్లూ జాబితాలో లేవు. దీంతో ఎస్కేఎస్ సంస్థ ఈక్విటీ టార్గెట్ ప్రైస్ ను రూ. 707 నుంచి రూ. 428కి తగ్గిస్తున్నట్టు ఎడిల్ వైజస్ సెక్యూరిటీస్ ప్రటించింది. సంస్థ రేటింగ్ ను తగ్గిస్తున్నట్టు తెలిపింది. ఒకదశలో రూ. 360కి చేరిన ఎస్కేఎస్ ఈక్విటీ విలువ చివరికి రూ. 376 వద్దకు చేరింది. క్రితం ముగింపుతో పోలిస్తే ఇది 16.65 శాతం పతనం. కాగా, శుక్రవారం నాటి సెషన్ ముగిసేసరికి బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజ్ సెన్సెక్స్ సూచిక క్రితం ముగింపుతో పోలిస్తే 202.83 పాయింట్లు పెరిగి 0.77 శాతం లాభంతో 26,163.70 పాయింట్ల వద్ద, నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ సూచిక నిఫ్టీ 82.75 పాయింట్లు పెరిగి 1.05 శాతం లాభంతో 7,981.90 పాయింట్ల వద్దకు చేరాయి. నిఫ్టీ-50లో 29 కంపెనీలు లాభపడ్డాయి. యాక్సిస్ బ్యాంక్, ఓఎన్జీసీ, ఎన్ఎండీసీ, కోటక్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా తదితర సంస్థలు 4 నుంచి 5 శాతానికి పైగా లాభపడగా, బజాజ్ ఆటో, హిందాల్కో, సిప్లా, టాటా మోటార్స్, ఐటీసీ తదితర కంపెనీలు ఒకటిన్నర నుంచి 3 శాతానికి పైగా నష్టపోయాయి. బీఎస్ఈలో మిడ్ కాప్ 0.89 శాతం, స్మాల్ కాప్ 1.11 శాతం పెరిగాయి. లిస్టెడ్ కంపెనీల మార్కెట్ విలువ రూ. 94.61 లక్షల కోట్లుగా నమోదైంది.