: అభివృద్ధిలో కాదు, అవినీతిలో రెండంకెల వృద్ధి సాధించిన రెవెన్యూ శాఖ: చంద్రబాబు ఆగ్రహం
ఆంధ్రప్రదేశ్ లో రెవెన్యూ శాఖ అధికారులు మారాల్సిన తరుణం ఆసన్నమైందని, అధికారులు, ఉద్యోగులు పారదర్శకంగా పనిచేస్తూ, లంచాలకు దూరంగా ఉండి, ప్రజలకు దగ్గర కావాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పిలుపునిచ్చారు. ఈ ఉదయం కలెక్టర్లతో సమావేశమైన ఆయన రెవెన్యూ శాఖ పనితీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అభివృద్ధిలో రాష్ట్రం రెండంకెల వృద్ధిని సాధించాలని తాను కోరుతుంటే, కొన్ని ప్రభుత్వ శాఖలు అవినీతిలో రెండంకెల వృద్ధిని సాధించాయని ఆయన అన్నారు. ముఖ్యంగా రెవెన్యూ శాఖపై ఉన్న అవినీతి ముద్ర తొలగించుకోవాలని సూచించారు. అధికారులే ప్రజల వద్దకు వెళ్లి అభిప్రాయాలను తెలుసుకోవాలని, పారిశ్రామిక వృద్ధిలో ఏపీని ప్రపంచంలో ఐదో స్థానంలో నిలపాలన్నదే తన తక్షణ లక్ష్యమని అన్నారు. ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి మరింతగా తీసుకెళ్లాలని, రుణమాఫీ సక్రమంగా జరుగుతున్నా, కొందరు తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని ఆరోపించారు. అన్ని శాఖల మధ్యా సమన్వయం కోసం కలెక్టర్లు ప్రయత్నించాలని సూచించిన ఆయన, విద్యుత్ కోతలు ఎక్కడా లేకుండా చూడాలని ఏపీ జెన్ కో సీఎండీ అజయ్ జైన్ కు ఆదేశాలు జారీ చేశారు.