: ఢిల్లీ యువకుల సాహసం
దేశ రాజధాని ఢిల్లీలో విదేశీ మహిళలపై నాడు జరిగిన దాడుల ప్రభావం మనకు చెడ్డ పేరు తీసుకువచ్చిన విషయం తెలిసిందే. దాని నుంచి బయటపడటానికి కేంద్ర ప్రభుత్వం ఎంతగానో ప్రయత్నించి, మహిళలకు భద్రతపై మరింత దృష్టి పెట్టింది. మనల్ని అదే పనిగా విమర్శించే దేశాలైతే, భారత దేశ రాజధానిలోనే మహిళల పరిస్థతి ఈవిధంగా ఉంటే..మిగిలిన నగరాలు, పట్టణాల పరిస్థితి ఏంటంటూ ప్రశ్నలూ సంధించాయి. ఇదంతా గతం. విదేశీయురాలిపై దాడి చేసి ఆమె మొబైల్ ను దొంగిలించేందుకు యత్నించిన ఒక కుర్రదొంగకు బుద్ధి చెప్పిన సంఘటన ఢిల్లీ యువకుల మానవత్వానికి నిదర్శనంగా నిలిచింది. ‘మాలివ్యా నగర్ మానియాక్స్’ అనే పేరుతో ఢిల్లీకి చెందిన యువకుల బృందం ఒకటుంది. సర్తాఖ్ శర్మ, XII, ఎల్బీఎస్ స్కూల్, ఆర్కె పురం, అరుణ్ సింగ్ రాజ్ పుట్,XII, సెయింట్ పాల్స్, జాప్నీత్, సెకండ్ ఇయర్, షాహీద్ భగత్ సింగ్ కాలేజ్, ఆయూష్ జోషి, XII ఈ బృందంలో ఉన్నారు. మాలివ్యానగర్ లో గత ఆగస్టు 19వ తేదీ రాత్రి 10 గంటలకు ఉజ్బెకిస్థాన్ జాతీయురాలి మొబైల్ ఫోన్ ను కొట్టేసేందుకు ఒక కుర్రాడు ఆమెను వెంబడించాడు. అదే సమయంలో అక్కడ ఉన్న ఒక పార్క్ లో మ్యాచ్ కోసం ప్రాక్టీసు చేస్తున్న యువకులు ఉన్నారు. తన మొబైల్ ఫోన్ కొట్టేసేందుకు వస్తున్న అతన్ని చూసి విదేశీ జాతీయురాలు భయపడుతూ, అరుస్తూ పరిగెత్తడం ఆ యువకులు గమనించారు. అంతే, మ్యాచ్ ప్రాక్టీసు చేస్తున్న యువకులు రంగంలోకి దిగారు. ఆ దొంగ వెనుక వీరు పరుగు ప్రారంభించారు. రద్దీగా ఉన్న రోడ్డులో కొంచెం కష్టమే అయినప్పటికీ ఒక కారు వెనుక యువకులు దాక్కుని ఆ దొంగను పట్టుకున్నారు. ఇదంతా ఆ ప్రాంతంలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల్లో రికార్డు కావడంతో యువకుల సాహసం, మానవత్వం వెలుగులోకి వచ్చాయి.