: అమెరికా సిద్ధం చేస్తున్న 'సూపర్ బాంబర్'... విశేషాలు ఇవే!
నెక్స్ట్ జనరేషన్ 'సూపర్ బాంబర్'ల తయారీ కాంట్రాక్టును అమెరికా అతి త్వరలో ప్రకటించనుంది. ఎల్ఆర్ఎస్బీ (లాంగ్ రేంజ్ స్ట్రయిక్ బాంబర్) తయారు చేసే బాధ్యతను లాక్ హీడ్ మార్టిన్, బోయింగ్ లేదా నార్త్ రాప్ గ్రుమ్మన్ సంస్థల్లో ఒకదానికి అందించవచ్చని తెలుస్తోంది. ఇవి తయారైతే, అమెరికా వద్ద ఉన్న బీ-52, బీ-1ఎస్ లను ఈ అధునాతన యుద్ధ విమానాలతో రీప్లేస్ చేస్తారు. ఇవి అత్యాధునికమైనవని పరిశ్రమ నిపుణులు వ్యాఖ్యానించారు. బాంబులు, అణ్వాయుధాలను ఇవి సులువుగా మోసుకెళ్లగలవని, ఖండాలను దాటి ప్రయాణించే శక్తిని కలిగివుంటాయని వివరించారు. నిఘా రాడార్లకు దొరక్కుండా, అత్యధిక ఎత్తులో ప్రయాణిస్తాయని అమెరికా విమానయాన విశ్లేషకులు రిచర్డ్ అబౌలాఫియా వ్యాఖ్యానించారు. తాను విడుదల చేసే ఎలక్ట్రానిక్ సిగ్నళ్లకు మాస్క్ వేయడం, శత్రువులు టార్గెట్ చేస్తే వాటిని అడ్డుకునేలా శక్తిమంతమైన జామర్లను కలిగివుంటుందని, శబ్దవేగం కన్నా అధిక స్పీడుతో దూసుకెళ్తుందని వివరించారు. కాగా, ఇప్పటికే అమెరికా వద్ద రాడార్లకు కనపడని బీ-2 స్టెల్త్ బాంబర్లుండగా, వాటికన్నా ఇవి బలమైనవని తెలుస్తోంది. పైలట్ లేకుండానే ప్రయాణం చేయడం, గాల్లోనే ఇంధనాన్ని నింపుకోవడం వంటి సౌలభ్యాలతో పాటు, రిమోట్ కంట్రోల్ బాంబర్ గానూ పనిచేస్తుందని, దీనిలో 'కిల్ స్విచ్' ఉంటుందని తెలుస్తోంది.