: వేర్పాటువాది అసియా ఆంద్రాబి అరెస్టు
కరుడుగట్టిన మహిళా వేర్పాటువాది అసియా ఆంద్రాబినీ శ్రీనగర్ పోలీసులు ఈ రోజు అరెస్టు చేశారు. రాడికల్ మహిళా సంస్థ దుక్తరన్-ఏ-మిలాత్(డీఈఎం) ఆసియాకు చీఫ్ అయిన ఆంద్రాబి జాతి వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారనే ఆరోపణలపై ఆమెను అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. శ్రీనగర్ లోని ఆంద్రాబి నివాసం రామ్ భాగ్ పై పోలీసులు ఉదయం దాడులు నిర్వహించి ఆమెను అదుపులోకి తీసుకున్నట్లు చెప్పారు. జమత్ -ఉద్ దవా (జేయుడీ) అధినేత, 26/11 దాడుల రూపకర్త అయిన హఫీజ్ సయీద్ పాకిస్తాన్ లో నిర్వహించిన ఒక ర్యాలీలో ఆంద్రాబి టెలిఫోన్ ద్వారా ప్రసంగించే విషయమై ఆయనతో ఫోన్ లో మాట్లాడింది. ఈ నేపథ్యంలో ఆంద్రాబిపై చట్ట వ్యతిరేక కార్యకలాపాల నిరోధక యాక్టును ప్రయోగించారు. ఆగస్టు 14 వతేదీన లాహోర్ లో ఈ ర్యాలీ జరిగింది. ఆ రోజున పాకిస్తాన్ ప్రజలకు స్వాతంత్ర్య దినోత్సవం శుభాకాంక్షలు తెలిపిన ఆంద్రాబీ, భారత్ పై విషం కక్కుతూ నాడు ప్రసంగించారు. ఆ సమయంలో వేదికపైనే ఉన్న సయీద్, ఆమె టెలిఫోన్ ప్రసంగాన్ని విన్నాడు.