: టీ టీడీపీ చీఫ్ గా రేవంత్ రెడ్డి?... సెర్ఛ్ కమిటీతో చంద్రబాబు కీలక భేటీ
తెలుగుదేశం పార్టీ తెలంగాణ రాష్ట్ర శాఖ అధ్యక్షుడిగా ఆ పార్టీ యువ నేత, టీ టీడీఎల్పీ ఉపనేత రేవంత్ రెడ్డి నియమితులు కాబోతున్నారంటూ జోరుగా ప్రచారం సాగుతోంది. నిన్న హైదరాబాదు వచ్చిన టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు నేటి ఉదయం తెలంగాణ సెర్చ్ కమిటీతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. టీ టీడీపీ ప్రస్తుత అధ్యక్షుడు ఎల్.రమణ, టీడీపీఎల్పీ నేత ఎర్రబెల్లి దయాకరరావు, రేవంత్ రెడ్డి, మోత్కుపల్లి నర్సింహులు, నన్నూరి నర్సిరెడ్డి, రాములు తదితర సీనియర్ నేతలు ఈ భేటీకి హాజరయ్యారు. భేటీలో భాగంగా చంద్రబాబు ‘ఐవీఆర్ఎస్’ (ఇంటరాక్టివ్ వాయిస్ రెస్పాన్స్ సిస్టం) ద్వారా పార్టీ క్రియాశీల కార్యకర్తల నుంచి సేకరించిన అభిప్రాయాలను ప్రస్తావించారు. విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు, ఐవీఆఆర్ఎస్ లో మెజారిటీ కార్యకర్తలు పార్టీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి పేరును ప్రస్తావించారట. ఇదే విషయాన్ని చంద్రబాబు పార్టీ నేతల ముందుంచినట్లు తెలుస్తోంది. పార్టీ కార్యకర్తల అభిప్రాయాలకు అత్యధిక విలువ ఇచ్చే చంద్రబాబు... ఐవీఆర్ఎస్ కే ఓటేస్తే, పార్టీ తెలంగాణ శాఖ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి ఎంపిక లాంఛనమే. ఇక పార్టీ తెలంగాణ శాఖను మొత్తం 65 మందితో ఏర్పాటు చేయనున్నట్లు సమాచారం. ఈ మేరకు ఆయా పోస్టులకు ఏఏ నేతలైతే సరిపోతారన్న విషయాలపైనా పార్టీ ఐటీ విభాగం ఐవీఆర్ఎస్ ద్వారా క్రియాశీల కార్యకర్తల నుంచి అభిప్రాయాలను సేకరించినట్లు సమాచారం.