: గణనాథుల భారీ లడ్డూల తయారీకి కేరాఫ్ అడ్రెస్ తాపేశ్వరం!
వినాయక చవితి సమీపిస్తోందంటే చాలు, తూర్పు గోదావరి జిల్లా తాపేశ్వరంలో కోలాహలం నెలకొనడం ఏళ్లుగా చూస్తున్నదే. వినాయక చవితి సందర్భంగా కొలువుదీరనున్న గణనాథుల విగ్రహాల చేతిలో లడ్డూలను ఉంచడం తెలిసిందే. ఈ లడ్డూలను చేజిక్కించుకునేందుకు నిమజ్జనం రోజున పెద్ద సంఖ్యలో భక్తులు గంటల తరబడి జరిగే వేలంలో ఉత్సాహంగా పాలుపంచుకుంటారు. ఖైరతాబాదు వినాయకుడి విగ్రహం చేతిలో ఉంచుతున్న లడ్డూ గత కొన్నాళ్లుగా తాపేశ్వరంలో తయారవుతున్న విషయం తెలిసిందే. ఈ ఏడాది ఖైరతాబాదు వినాయకుడి కోసం తాపేశ్వరానికి చెందిన సురుచి ఫుడ్స్ అధినేత పోలిశెట్టి మల్లిబాబు ఈ ఏడాది 5,600 కిలోల లడ్డూను తయారు చేశారు. ప్రస్తుత్తం తాపేశ్వరం నుంచి బయలుదేరిన ఈ లడ్డూ నేటి రాత్రి హైదరాబాదుకు చేరుకునే అవకాశాలున్నాయి. భారీ లడ్డూను ప్రత్యేక వాహనంలో మల్లిబాబు హైదరాబాదుకు తీసుకువస్తున్నారు. ఇక విశాఖలోని 82 అడుగుల భారీ గణేశుడి విగ్రహం చేతిలో పెట్టేందుకు 8,300 కిలోల లడ్డూ తయారైంది. ఈ లడ్డూ కూడా తాపేశ్వరంలోనే తయారైంది. ఈ లడ్డూ ఇప్పటికే విశాఖలోని గాజువాకలో ఏర్పాటు చేసిన గణపతి విగ్రహం చెంతకు చేరింది. దీనిని తాపేశ్వరం కేంద్రంగా స్వీట్ల తయారీలో పేరు ప్రఖ్యాతులు గాంచిన శ్రీభక్తాంజనేయ స్వీట్స్ యజమాని సలాది వెంకటేశ్వరరావు (శ్రీనుబాబు) రూపొందించారు.