: మోదీ బర్త్ డే నేడు... అధికారిక నివాసంలోకి ‘ఒకే ఒక్కరికి’ మాత్రమే అనుమతి!
భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేటితో 66వ పడిలో పడనున్నారు. నేడు 65వ జన్మదినాన్ని ఆయన అత్యంత నిరాడంబరంగా జరుపుకోనున్నారు. గతేడాది ప్రధానిగా పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత తన తొలి జన్మదినాన్ని అహ్మదాబాదులోని తన తల్లి హీరాబెన్ వద్ద సాదాసీదాగా జరుపుకున్న మోదీ, ఈ ఏడాది కూడా తన జన్మదినం సందర్భంగా ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించవద్దని బీజేపీ కార్యకర్తలకు, దేశ ప్రజలకు పిలుపునిచ్చారు. ఇక జన్మదినం సందర్భంగా ఎలాంటి ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించుకోని మోదీ, యథావిధిగా రోజువారీ అధికారిక కార్యక్రమాలకు హాజరు కానున్నారు. ఇదిలా ఉంటే, నేడు ప్రధాని అదికారిక నివాసంలోకి ‘ఒకే ఒక్కరికి’ మినహా మిగిలిన ఏ ఒక్కరికి కూడా అపాయింట్ లభించలేదు. ఆ ‘ఒకే ఒక్కరు’ ఎవరనే ఆసక్తి నెలకొంది. భద్రతా కారణాల రీత్యా సదరు వ్యక్తి పేరును వెల్లడించేందుకు నిరాకరించిన పీఎంఓ కార్యాలయం, ఆయన గురించిన వివరాలను మాత్రం బహిర్గతం చేసింది. 2000 సంవత్సరంలో అప్పటికి మోదీ ఇంకా గుజరాత్ ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టలేదు. నాడు బీజేపీ ప్రధాన కార్యదర్శి హోదాలో ఢిల్లీ, అశోకా రోడ్డులోని పార్టీ ప్రధాన కార్యాలయంలో ఓ చిన్న గదిలో ఉండే మోదీని ఎవరూ పట్టించుకునేవారే కాదట. ఆ ఏడాది ఆయన జన్మదినాన్ని పురస్కరించుకుని అక్కడ పనిచేసే ఓ వ్యక్తి మోదీ వద్దకు వచ్చి, బర్త్ డే గ్రీటింగ్స్ చెప్పి నోరు తీపి చేశాడట. అయితే ఆ వ్యక్తికి ఇచ్చేందుకు మోదీ వద్ద కేవలం రూ.2 ఉన్నాయట. దీంతో ‘‘నా వద్ద రూ.2 లే ఉన్నాయి. ఏం కొనివ్వమంటావు?’’ అని మోదీ ఆ వ్యక్తిని అడిగారు. ‘‘రాబోయే రోజుల్లో మీరు ఇంకా పెద్ద పదవిలోకి వెళతారు. అప్పుడు నన్ను గుర్తుపెట్టుకోండి చాలు. నాకేమీ ఇవ్వొద్దు’అని బదులిచ్చాడట. ఆ వ్యక్తి నోటి పుణ్యమాని, ఆ మరుసటి ఏడాదే గుజరాత్ లో కేశుభాయి పటేల్ ప్రభుత్వం సంక్షోభంలో పడిపోవడం, 2001 అక్టోబర్ 7న నరేంద్ర మోదీ గుజరాత్ సీఎం పదవి చేపట్టడం జరిగిపోయాయి. ఆ మరుసటి ఏడాది (2002)లో మోదీ తన జన్మదినం సందర్భంగా ఆ వ్యక్తిని గుర్తుపెట్టుకుని తన ఇంటికి పిలిపించుకుని అతడితో కలిసి భోజనం చేశారట. అప్పటి నుంచి ఏటా ఆ వ్యక్తిని మోదీ తన జన్మదినం రోజున కలుస్తూనే ఉన్నారు. ఈ ఏడాది కూడా ఆ ఒక్క వ్యక్తికి మాత్రమే ప్రధాని అధికారిక నివాసంలోకి ప్రవేశం లభించిందట.