: పాకిస్థాన్ క్రికెట్ లీగ్ లో క్రిస్ గేల్
పాకిస్థాన్ క్రికెట్ లీగ్ లో కరీబియన్ క్రికెట్ వీరుడు క్రిస్ గేల్ రంగప్రవేశం చేయనున్నాడు. పాకిస్థాన్ క్రికెట్ లీగ్ కు అంతర్జాతీయ క్రేజ్ తెచ్చేందుకు డిమాండ్ ఉన్న క్రికెటర్లను ఆడించాలని పీసీబీ భావిస్తోంది. అందులో భాగంగా అంతర్జాతీయ స్థాయిలో టీట్వంటీల్లో రాణించిన క్రీడాకారులను బిడ్డింగ్ లో పాల్గొనే విధంగా ఒప్పించేందుకు పీసీబీ నేరుగా రంగంలోకి దిగింది. ఈ క్రమంలో క్రిస్ గేల్ తో సంప్రదింపులు జరిపిన పీసీబీ, గేల్ కు భారీ ఆఫర్ ను ఇచ్చేలా జట్ల యజమానులను ఒప్పిస్తామని మాటిచ్చినట్టు తెలుస్తోంది. కాగా, గేల్ ఇప్పటికే వెస్టిండీస్ జాతీయ జట్టు, ఐపీఎల్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, బిగ్ బాష్, కౌంటీలకు ప్రాతినిధ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే. యూఏఈ వేదికగా పీసీబీ నిర్వహించనున్న పీసీఎల్ కు భారీ క్రేజ్ వస్తుందని పాకిస్థాన్ క్రికెట్ బోర్డు భావిస్తోంది. అందులో భాగంగానే భారత్ తో ఆడకపోయినా వచ్చిన నష్టమేం లేదు, పీసీఎల్ ఉంది కదా అని బీరాలు పలుకుతోంది. ఐపీఎల్ రేంజ్ లో పీసీఎల్ హిట్ అవుతుందో లేక సీసీఎల్ రేంజ్ లో ఫట్ మంటుందో భవిష్యత్ నిర్ణయించనుంది. పీసీఎల్ హిట్ అయితే పాక్ ఆటగాళ్ల పంటపండినట్టే, ఫెయిల్ అయితే మాత్రం పీసీబీ పీకల్లోతు కష్టాల్లో మునిగిపోతుందని క్రీడా పండితులు అభిప్రాయపడుతున్నారు.