: తెలంగాణ వచ్చాక తొలి ఎన్ కౌంటర్... వరంగల్ జిల్లాలో మహిళా మావోయిస్టు సహా ఇద్దరి కాల్చివేత


తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత తొలి ఎన్ కౌంటర్ నమోదైంది. వరంగల్ కు 120 కిలోమీటర్ల దూరంలోని తాడ్వాయి సమీపంలోని వెంగళాపూర్ వద్ద మావోయిస్టులకు, పోలీసులకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో మహిళా మావోయిస్టు సహా మరో వ్యక్తి మరణించగా, వారి నుంచి అత్యాధునిక ఏకే-47 తుపాకులను స్వాధీనం చేసుకున్నట్టు తెలుస్తోంది. ఈ తెల్లవారుఝామున జరిగిన ఎన్ కౌంటర్ లో స్వామి అనే మావోయిస్టు కూడా హతమయ్యాడని తెలుస్తోంది. ఇటీవలి కాలంలో ఈ ప్రాంతంలో మావోల కార్యకలాపాలు పెరిగాయి. ఓ ప్రొక్లెయినర్ ను తగులబెట్టిన మావోలు, కొందరికి హెచ్చరికలు పంపుతూ కరపత్రాలను కూడా పంచారు. ఈ నేపథ్యంలో కూంబింగ్ కు వెళ్లిన గ్రే హోండ్స్ దళాలకు మావోలు తారసపడ్డట్టు సమాచారం. లొంగిపోవాలని పోలీసులు హెచ్చరించినా మావోలు వినలేదని, తప్పనిసరి పరిస్థితుల్లో ఎదురుకాల్పులు చేయాల్సి వచ్చిందని పోలీసు వర్గాలు తెలిపాయి. ఘటనాస్థలిలో ఏకే-47 లభించినట్టు అధికారికంగా పోలీసులు వెల్లడించనప్పటికీ, సమీపంలోని గ్రామస్థులు ఈ విషయాన్ని ఖరారు చేస్తున్నారు. మరికొందరు మావోలు అడవుల్లోకి పారిపోయారని పసిగట్టిన పోలీసులు కూంబింగ్ ను ముమ్మరం చేశారు.

  • Loading...

More Telugu News