: నాలుగు గ్రే హోండ్స్, రెండు ఆక్టోపస్ దళాలతో తిరుమల జల్లెడ!
రేపటి నుంచి తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు జరగనున్న నేపథ్యంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా తిరుమల గిరులను పోలీసులు జల్లెడ పడుతున్నారు. సాధారణ భద్రతాదళాలకు అదనంగా నాలుగు గ్రే హోండ్స్, రెండు ఆక్టోపస్ బెటాలియన్ దళాలను తిరుమలకు తరలించిన అధికారులు గట్టి భద్రతా ఏర్పాట్లు చేశారు. వివిధ ప్రాంతాల్లో 650 సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి అనుక్షణం భక్తుల కదలికలను పరిశీలించే ఏర్పాట్లు చేశారు. నాలుగు మాడవీధుల్లో 8 ఫైర్ టీములను అందుబాటులో ఉంచారు. ఈ నెల 24 వరకూ శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు వైభవంగా జరిపేందుకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేయగా, రేపు ఏపీ సీఎం చంద్రబాబునాయుడు స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు. ఈ నెల 17న గవర్నర్ నరసింహన్ శ్రీవెంకటేశ్వరుని దర్శనం నిమిత్తం రానున్నారు.