: స్నేహితురాలి నిశ్చితార్థాన్ని ఆపేసిన వీరు పిల్లలు కాదు... పిడుగులే!


వారందరూ పదవ తరగతి పిల్లలు. తమ స్నేహితురాలి నిశ్చితార్థానికి వెళ్లాలని అనుకున్నారు. టీచరును పర్మిషన్ అడిగారు. ఈ వయసులో పెళ్లి ఏంటని ప్రశ్నించి, బాల్య వివాహాలపై చిన్నారుల్లో అవగాహన వచ్చేలా టీచర్ క్లాస్ పీకారు. దీంతో ఆ పిల్లలు వానరమూకలా కదిలారు. పిడుగుల్లా వెళ్లి తమ ఫ్రెండ్ నిశ్చితార్థాన్ని అడ్డుకున్నారు. వీరికి తోడుగా పోలీసులు, షీ టీమ్స్ కదలి రావడంతో, తొలుత కాసేపు వాదనలు జరిగినా, చివరికి ఆ బాలిక తల్లిదండ్రులు దిగిరాక తప్పలేదు. ఈ ఘటన చిత్తూరు జిల్లా మదనపల్లిలో జరిగింది. మరిన్ని వివరాల్లోకి వెళితే, పట్టణంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న ఓ అమ్మాయికి వివాహం నిశ్చయమైంది. ఆ అమ్మాయి నిశ్చితార్థానికి వెళ్లి వస్తామని కొందరు విద్యార్థినులు టీచర్ ను పర్మిషన్ అడగటంతో, బాల్య వివాహాలను, వాటిపై ఉన్న నిషేధాన్ని, ఆ చట్టం అమలవుతున్న తీరును గురించి టీచర్ విశదీకరించారు. మైనారిటీ తీరకుండా పెళ్లి చేసుకుంటే, వచ్చే సమస్యల గురించి కూడా చెప్పారు. దీంతో ఆలోచనలో పడ్డ పిల్లలు, మా స్నేహితురాలి పెళ్లి ఆపుదాం, సహకరించాలని టీచర్ ను కోరారు. 50 మంది విద్యార్థినీ విద్యార్థులు కలసి ఆమె ఇంటికి వెళ్లి నిలదీశారు. తమ బిడ్డ తమ ఇష్టమని వాదించిన తల్లిదండ్రులకు, పోలీసులులతో బాటు, మహిళా సంఘాలు కౌన్సిలింగ్ ఇచ్చాయి. దీంతో వారు సైతం చేసేదేమీ లేక నిశ్చితార్థాన్ని రద్దు చేసి, ఆ అమ్మాయిని తిరిగి పాఠశాలకు పంపేందుకు నిర్ణయించారు. ఇప్పుడా పిల్లలు చేసిన పనికి ఉన్నతాధికారుల నుంచి ప్రశంసలు అందుతున్నాయి.

  • Loading...

More Telugu News