: వాజ్ పేయి మరణించారనుకుని ఓ పాఠశాలలో శ్రద్ధాంజలి ఘటించారు!
మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్ పేయి బతికుండగానే ఓ పెద్ద తప్పు జరిగిపోయింది. ఆయన చనిపోయారంటూ ఒడిశాలోని బాలాసోర్ ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులు శ్రద్ధాంజలి ఘటించి, నివాళులర్పించిన ఘటన తాజాగా చోటుచేసుకుంది. అంతేకాదు, పాఠశాలకు సెలవు కూడా ఇచ్చారు. వివరాల్లోకి వెళితే... ఆ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు కమలకాంత్ దాస్ 'ఉపాధ్యాయ శిక్షణా' కార్యక్రమానికి వెళ్లినప్పుడు వాజ్ పేయి చనిపోయారని మరో ఉపాధ్యాయుడు చెప్పాడట. అలా ఆయన పాఠశాలకు ఫోన్ చేసి సెలవు ప్రకటించారు. విద్యార్థులందరినీ ఇంటికి వెళ్లిపొమ్మని చెప్పారు. దాంతో వాజ్ పేయి ఆత్మకు శాంతి చేకూరాలంటూ పాఠశాల మిగతా ఉపాధ్యాయులు, విద్యార్థులు కలసి మౌనం పాటించారు. తరువాత ఇళ్లకు వెళ్లిపోయారు. ఈ విషయమంతా తెలుసుకున్న కొందరు స్థానికులు కలెక్టర్ కు ఫిర్యాదుచేసి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ క్రమంలో కలెక్టర్ ఘటనపై విచారణకు ఆదేశించారు.