: తిరుమల బ్రహ్మోత్సవాల్లో ఏ రోజు స్వామిని దర్శిస్తే, ఏం ప్రయోజనాలు కలుగుతాయో తెలుసా?
తిరుమలలో దేవదేవుని బ్రహ్మోత్సవాలు మొదలు కానున్నాయి. బ్రహ్మోత్సవాల సమయంలో స్వామివారు ఎంతో ప్రశాంతంగా ఉంటారు. భక్తుల నుంచి వచ్చే మొర ఆలకించేందుకు మరింత సమయాన్ని ఇస్తారు. ఈ సమయంలో స్వామిని దర్శించుకుంటే విశేషమైన అనుగ్రహం పొందుతారు. ఈ నేపథ్యంలో స్వామివారిని ఏ వాహన సేవ రోజున దర్శించుకుంటే, భక్తులకు ఏం ప్రయోజనాలు కలుగుతాయో ఆలయ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు స్వయంగా వివరించారు. ఆదిశేష వాహనంపై శ్రీవారిని దర్శించుకుంటే, సర్ప భయం పోతుందని, కాలసర్ప దోష నివారణ జరుగుతుందని తెలిపారు. గరుడ వాహన దర్శనం వల్ల సంతానప్రాప్తి, దివ్యమైన జ్ఞానం కలుగుతాయని, హంస వాహన దర్శనంతో విచక్షణా జ్ఞానం పెరుగుతుందని, సింహం వల్ల మృగభయం నశిస్తుందని, గజ వాహన దర్శనం వల్ల మహాలక్ష్మీ కటాక్షం కలిగి, సంపదలతో వర్థిల్లుతారని తెలియజేశారు. అశ్వ వాహన సేవ నాడు స్వామిని సేవిస్తే, దుర్గుణాలు పోయి సద్గుణవంతులవుతారని, మహారథంలో స్వామిని సందర్శిస్తే, పునర్జన్మ రాహిత్యం కలుగుతుందని, కల్పవృక్ష వాహన సేవ నాడు తిరుమలలో ఉంటే సకల అభీష్టాలూ నెరవేరుతాయని అన్నారు. ఇటువంటి మహా అనుగ్రహాలను ఈ 9 రోజుల వాహన సేవలను దర్శించడం ద్వారా భక్తులు పొందవచ్చని తెలిపారు. వాహన సేవల సందర్భంగా నాణాలు విసరడం వంటి పనులు చేయరాదని సూచించారు. అవి తగిలి స్వామివారి దివ్యమైన రూపానికి గాయాలు కావచ్చని అన్నారు. ఇలా నాణాలు చల్లడం అపచారమని వివరించారు.