: బరువు తగ్గుతారా?... ఇంటికెళతారా?: ఉద్యోగులకు ఎయిర్ ఇండియా తాఖీదులు
ఎయిర్ ఇండియాలో ఉద్యోగం సంపాదించారని సంతోషిస్తున్నారా?.. మంచిదే కానీ, ఆ ఉద్యోగాన్ని కాపాడుకోవాలంటే మాత్రం బరువు పెరగకుండా జాగ్రత్తలు పాటించాల్సిందే. లేదంటే, ఏ క్షణంలోనైనా ఉద్యోగం ఊడటం ఖాయమే. ప్రస్తుతం ఆ సంస్థలో పనిచేస్తున్న 125 మంది ఇదే పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. విధి నిర్వహణలో మెరుగ్గానే రాణిస్తున్న వీరు, బరువు తగ్గించుకునే విషయంలో మాత్రం సఫలం కాలేదు. దీంతో బరువు తగ్గుతారా? లేక అప్రాధాన్య విభాగాలకు బదిలీ చేయాలా? అంటూ ఎయిర్ ఇండియా యాజమాన్యం వీరందరికీ నోటీసులు జారీ చేసింది. సంస్థలో పనిచేస్తున్న మొత్తం సిబ్బందిలో 600 మంది ఉద్యోగులు అధిక బరువు ఉన్నారని యాజమాన్యం తేల్చింది. ఈ 600 మంది జాబితాలో స్లిమ్ గా ఆకట్టుకునే రూపంతో ఉండాల్సిన ఎయిర్ హోస్టెస్ లు కూడా కొంత మంది ఉన్నారట. బరువు తగ్గితేనే ఉద్యోగంపై భరోసా అంటూ సంస్థ 18 నెలల క్రితం 600 మందికి నోటీసులు జారీ చేసింది. బరువు తగ్గేందుకు 19 నెలల గడువును విధించింది. దీంతో నానా పాట్లు పడి 475 మంది బరువు తగ్గించేసుకున్నారు. మిగిలిన 125 మందికి మాత్రం బరువును తగ్గించుకోవడం సాధ్యం కాలేదట. మరో నెలలో యాజమాన్యం విధించిన గడువు ముగియనుంది. ఆలోగా బరువు తగ్గకుంటే వారిని ఆకాశయానంలో విధులు నిర్వర్తించేందుకు సంస్థ అనర్హులుగా ప్రకటించనుంది. అయితే గ్రౌండ్ డ్యూటీల పేరిట అప్రాధాన్య విభాగాలకు బదిలీ చేస్తుందట. వినువీధిలో విధులు నిర్వర్తించిన వీరు గ్రౌండ్ డ్యూటీ చేయడం అంటే అంత ఈజీ కాదు. అంతేకాక దీనిని తల తీసేసినట్లుగానే వారు భావిస్తారట. ఒకవేళ సంస్థ చర్యలకు ఉపక్రమిస్తే వీరిలో మెజారిటీ సిబ్బంది ఉద్యోగాలు మానేయడం ఖాయంగానే కనిపిస్తోంది.