: సైకిలెక్కిన కర్నూలు ఎస్పీ రవికృష్ణ... ఆయన స్టయిలే వేరు!


కర్నూలు జిల్లా ఎస్పీ రవికృష్ణ స్టైలే వేరు. ఫ్యాక్షన్ ఖిల్లాలో హత్యా రాజకీయాలపై ఉక్కుపాదం మోపిన ఆయన, సామాజిక కార్యక్రమాలకు తెరలేపి తనదైన శైలిలో దూసుకెళుతున్నారు. జిల్లాలో కరుడుగట్టిన ఫ్యాక్షనిస్టులకు నెలవైన కప్పట్రాళ్లను దత్తత తీసుకున్న రవికృష్ణ ఇప్పటికే గ్రామ రూపురేఖలు మార్చేశారు. గ్రామంలోని యువకుల్లో ఇప్పటికే పెనుమార్పు తీసుకొచ్చిన ఆయన వారిని ఉద్యోగాల బాట పట్టించారు. ఇందుకోసం ప్రత్యేకంగా శిక్షణా తరగతులను ఉచితంగానే నిర్వహించేలా కోచింగ్ సెంటర్లను కూడా ఆయన ఒప్పించగలిగారు. తాజాగా ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించిన స్వచ్ఛ భారత్ కు బాసటగా నిలిచేందుకు రవికృష్ణ రంగంలోకి దిగారు. స్వచ్ఛ భారత్ పై అవగాహన కల్పించేందుకు నేటి ఉదయం ఆయన సైకిల్ ర్యాలీని ప్రారంభించారు. కోడుమూరు నుంచి తన దత్తత గ్రామం కప్పట్రాళ్ల వరకు 20 కిలో మీటర్ల మేర సాగనున్న సైకిల్ ర్యాలీని ఆయన కొద్దిసేపటి క్రితం ప్రారంభించారు. వందలాది మంది యువకులు ఉత్సాహంగా పాలుపంచుకుంటున్న ఈ యాత్రలో రవికృష్ణ స్వయంగా సైకిలెక్కారు.

  • Loading...

More Telugu News