: మక్కా మసీదులో కూలింది లాడెన్ క్రేనా?
ముస్లింల ఆధ్యాత్మిక క్షేత్రం మక్కాలో జరిగిన ప్రమాదంలో కుప్పకూలిన క్రేన్ ఆల్ ఖైదా అధినేత ఒసామా బిన్ లాడెన్ కుటుంబానికి చెందినదని సమాచారం. బిలియనీర్ అయిన బిన్ లాడెన్ తండ్రి మహమ్మద్ సౌదీ అరేబియాలో బిన్ లాడెన్ కన్ స్ట్రక్షన్ గ్రూప్ అనే కంపెనీని ఏర్పాటు చేశారు. సౌదీ రాజుతో ఉన్న సంబంధాల కారణంగా ఈ సంస్థ ఎన్నో నిర్మాణాలు చేపట్టింది. అనతి కాలంలోనే కోట్లకు పడగలెత్తింది. ఇప్పుడు ఈ గ్రూప్ ఆధ్వర్యంలోనే మక్కా మసీదులో ఒకేసారి 22 లక్షల మంది యాత్రికులు ఒకేచోట కూర్చుని ప్రార్థనలు నిర్వహించుకునే విధంగా, 1,40,000 వేల కోట్ల రూపాయలతో ప్రభుత్వం విస్తరణ కార్యక్రమాలు చేబట్టింది. ఇందు కోసం లాడెన్ కుటుంబ సభ్యులు భాగస్వాములుగా ఉన్న క్రేన్ల కంపెనీ నుంచి ఈ భారీ క్రేన్ ను తెప్పించి పనులు మొదలు పెట్టారు. బలమైన ఉరుములు, మెరుపులతో వాతావరణం బీభత్సంగా ఉండడంతో ప్రమాదం చోటుచేసుకుందని సౌదీ అధికారులు చెబుతుండగా, క్రేన్ ను సరిగా హ్యాండిల్ చేయకపోవడం వల్లే ఈ ప్రమాదం సంభవించిందని ప్రత్యక్షసాక్షులు చెబుతున్నారు.