: స్వైన్ ఫ్లూ పేరు చెప్పి కోట్లు దండుకుంటున్నారు!


చలికాలంలో ప్రజల ప్రాణాలతో చెలగాటమాడే స్వైన్ ఫ్లూ కారక హెచ్1ఎన్1 వైరస్ పట్ల ప్రజల్లో ఉన్న భయాందోళనలను తమ లాభాలుగా మలచుకున్నది ఎవరో తెలుసా? ప్రైవేటు ల్యాబొరేటరీలు! ఒక్క ముంబై వాసులు హెచ్1ఎన్1 వైరస్ తమ శరీరంలో ఉందో, లేదో తెలుసుకునేందుకు రూ. 8.25 కోట్ల రూపాయలను ఖర్చు పెట్టారంటే, ఇక దేశవ్యాప్తంగా ఎన్ని వందల కోట్లు ల్యాబొరేటరీల ఖాతాల్లోకి చేరివుంటాయో ఊహించుకోవచ్చు. మూడు నాలుగు రోజులకు మించి జలుబుతో బాధపడుతున్న వారు ఇన్ ఫ్లూయంజా వైరస్ సోకిందన్న భయాలతో పరీక్షలకు వెళుతుండగా, వైరస్ సోకినట్టు తేలిన వారు 20 శాతం మంది కూడా లేరు. ప్రభుత్వాసుపత్రి నుంచి రిఫర్ అయ్యే ఒక్కో రక్త పరీక్షకు రూ. 4,500 నుంచి రూ. 6 వేల వరకూ వసూలు చేస్తున్న ల్యాబొరేటరీలు, ప్రైవేటు ఆసుపత్రి నుంచి వచ్చే రోగులకు మాత్రం రూ. 13 వేల వరకూ బిల్లులు వేస్తున్నాయన్న ఆరోపణలు ఉన్నాయి. దగ్గు, జ్వరం ఉన్నా ఈ టెస్టులు చేయించుకునేందుకు జనాలు క్యూ కడుతున్నారు. ఈ సంవత్సరం జనవరి నుంచి స్వైన్ ఫ్లూ సోకి 1,335 మంది ఆసుపత్రుల్లో చేరారని బీఎంసీ ఎపిడమాలజిస్ట్ డాక్టర్ మినీ క్షేత్రపాల్ వ్యాఖ్యానించారు. తమకు అనుమానం వచ్చిన వారిలో కేవలం 9 శాతం మందికి మాత్రమే వైరస్ సోకినట్టు నిర్ధారణ అయిందని తెలిపారు. ఈ పరీక్షలను నిర్వహించేందుకు నియమిత అనుమతులను ల్యాబ్ లు ముందుగానే పొందివుండాలి. ఈ నిబంధన సైతం సక్రమంగా అమలు కావడం లేదని తెలుస్తోంది. ఇక ఈ సీజనులో స్వైన్ ఫ్లూ వచ్చేసింది. ఉత్తరాదిలో ఇప్పటికే 10 మంది మృత్యువాత పడగా, హైదరాబాద్ లో ఓ బాలింత మరణించింది. మరి, అమాయక ప్రజలు ల్యాబొరేటరీల బారిన పడకుండా కాపాడేందుకు అధికారులు ఎటువంటి చర్యలు తీసుకుంటారో!

  • Loading...

More Telugu News