: కిక్కిరిసిన బోనుల్లో కుక్కలవలె... శరణార్థుల అగచాట్ల వీడియో వెలుగులోకి!


ప్రాణాలు అరచేతుల్లో పెట్టుకుని శరణార్థులుగా వలస వచ్చిన వారికి ఆయా దేశాల ప్రభుత్వాలు కల్పిస్తున్న సౌకర్యాలేంటి? వారి అవసరాలను ఎలా తీరుస్తున్నారు? అన్న వాటిని పరికిస్తే, తాము శరణార్థులకు అన్ని రకాలుగా సాయం చేస్తున్నామని బయటి ప్రపంచానికి చెబుతున్న యూరప్ దేశాల్లో వాస్తవానికి జరుగుతున్నది వేరు. బయటకు వినిపిస్తున్న సమాధానం తప్పని చెబుతోందో వీడియో. హంగేరీలో ప్రధాన శరణార్థ శిబిరంలో దృశ్యాలు ప్రపంచదేశాల్లో సంచలనం సృష్టిస్తున్నాయి. వారిని పెద్ద పెద్ద ఇనుప బోనుల్లో ఉంచారు. పోలీసులు జంతువులకు వేసినట్టు ఆహారాన్ని విసిరేస్తూ కనిపిస్తున్నారు. శాండ్ విచ్ లున్న పొట్లాల కోసం 150 మంది ప్రజలు పోరాటం చేయాల్సిన పరిస్థితి ఈ వీడియోలో కనిపిస్తోంది. ఓ పెద్ద హాల్ లో చుట్టూ ఫెన్సింగ్ మధ్య హెల్మెట్లు ధరించిన హంగేరీ పోలీసులు వీరికి ఆహారాన్ని అందిస్తున్న వీడియోను ఆస్ట్రేలియా నుంచి వాలంటీర్ గా వెళ్లి శిబిరాన్ని సందర్శించిన ఓ వ్యక్తి రహస్యంగా చిత్రీకరించాడు. ఆహారం కోసం మహిళలు, చిన్నారులు చేతులు చాచి అర్థించాల్సిన పరిస్థితి నెలకొంది. ఆహారం అందిస్తున్న అధికారుల దృష్టిలో పడేందుకు వీరు పెడుతున్న కేకలు, అరుపులు అన్నీ ఇన్నీ కావు. "ఇక్కడి పరిస్థితి గ్వాంటనామోను తలపిస్తోంది. అక్కడి ఖైదీల మాదిరిగానే ఇక్కడా శరణార్థులను చూస్తున్నారు. జంతువులకు ఆహారం విసిరినట్టు వీరికి తిండి పడేస్తున్నారు. ఇది మానవత్వమని ఎంతమాత్రమూ అనిపించుకోదు. ఇక్కడ ఉన్న వారిలో వేలాది మందికి రోజుకు ఒక్కపూట తిండి కూడా దక్కడం లేదు" అని వీడియోను చిత్రీకరించిన క్లౌస్ కుఫ్నర్ వ్యాఖ్యానించారు. ఈ వీడియోను నిన్న యూట్యూబ్ లో అప్ లోడ్ చేయగా, సామాజిక మాధ్యమాల్లో శరవేగంగా విస్తరిస్తోంది. అంతే వేగంగా హంగేరీపై విమర్శలూ పెరుగుతున్న సంగతి వేరే చెప్పాలా?

  • Loading...

More Telugu News