: గుంటూరు కార్పొరేషన్ లో ఆరుగురు ఉద్యోగుల సస్పెన్షన్


ఆంధ్రప్రదేశ్ లోని గుంటూరు కార్పొరేషన్ లో పనిచేస్తున్న ఆరుగురు ఉద్యోగులను అవినీతి ఆరోపణలతో నగర పాలక కమిషనర్ అనురాధ సస్పెండ్ చేశారు. మరో ఇద్దరు ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను డిస్మిస్ చేసి, ముగ్గురు పర్యవేక్షణాధికారులకు చార్జి మెమోలు ఇచ్చారు. గుంటూరు కార్పొరేషన్ లో సుమారు కోటి రూపాయల ఆస్తి పన్ను సొమ్మును అక్రమంగా వాడుకున్నారని వారిపై ఆరోపణలు వచ్చాయి. దాంతో కమిషనర్ ఇద్దరు ఉన్నతాధికారులతో రహస్య విచారణ జరిపించారు. సొమ్మును వాడుకున్నట్టు విచారణలో తేలడంతో ఉద్యోగులపై చర్యలు తీసుకున్నారు. గుంటూరు నగరానికి చెందిన ఓ వ్యక్తి తన ఆస్తి పన్ను ఎక్కువగా రావడంతో రివిజన్ పిటిషన్ కోసం కార్పొరేషన్ కు రావడంతో అసలు విషయం బయటపడింది. తానిప్పటివరకు పన్ను కడుతూ వస్తున్నప్పటికీ అధిక పన్ను విధించడంపై ప్రశ్నించాడు. అంతవరకు తాను కట్టిన పన్ను రశీదులు కూడా చూపించాడు. వెంటనే ఆన్ లైన్ లో అతనికి సంబంధించిన పన్నుల వివరాలు సిబ్బంది చూడగా మొత్తం చెల్లించినట్టు తేలింది. అదే విషయాన్ని కమిషనర్ అనురాధకు సదరు వ్యక్తి ఫిర్యాదు చేశాడు. ఈ నేపథ్యంలోనే విచారణ చేయించగా.. గతేడాది మార్చి నుంచి ఇంతవరకు చూస్తే దాదాపు కోటి రూపాయల మొత్తాన్ని సిబ్బందే పక్కదారి పట్టించి వాడుకున్నారని తేలింది.

  • Loading...

More Telugu News