: మోదీని ఎదిరించిన ఆ ఐపీఎస్... కాంగ్రెస్ లో చేరాడు!
గుజరాత్ ముఖ్యమంత్రిగా మోదీ పదవీ బాధ్యతలు నిర్వహిస్తున్న సమయంలో ఐపీఎస్ అధికారిగా ఉండి, ఆయనతో తీవ్రంగా విభేదించిన కులదీప్ శర్మ కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. "ఇండియాలో రాజ్యాంగ నిబంధనలకు అనుగుణంగా పనిచేస్తున్న ఏకైక పార్టీ కాంగ్రెస్ మాత్రమే. అందువల్లే ఈ పార్టీలో చేరాను" అని కులదీప్ వివరించారు. గుజరాత్ కాంగ్రెస్ చీఫ్ భరత్ సిన్హ్ సోలంకి సమక్షంలో ఆయన కాంగ్రెస్ లో చేరారు. "గత సంవత్సరం నేను పదవీ విరమణ చేశాను. నాకింత ఇచ్చిన దేశానికి ఏదైనా చేయాలన్న సంకల్పంతో ఓ ఎన్జీవో ప్రారంభిద్దామని అనుకున్నాను. కానీ ఓ ప్రధాన పార్టీలో ఉంటేనే ప్రజలకు సేవ చేయవచ్చన్న ఉద్దేశంతో రాజకీయాల్లోకి వచ్చా" అన్నారు. కాగా, కులదీప్ తో పాటు ఆయన సోదరుడు, సస్పెండయిన ఐఏఎస్ అధికారి ప్రదీప్ శర్మ సైతం నరేంద్ర మోదీ నిర్ణయాలను బహిరంగంగానే తప్పుబట్టి వార్తల్లో నిలిచిన సంగతి తెలిసిందే. గుజరాత్ సీఐడీ విభాగానికి అధిపతిగా కులదీప్ ఉన్న సమయంలోనే సోహ్రాబుద్దీన్ ఎన్ కౌంటర్ జరుగగా, ఈ కేసులో విచారణకు ఆయనే నేతృత్వం వహించారు.