: ఐఫోన్ తో పాటు యాపిల్ విడుదల చేసిన వినూత్న ఉత్పత్తులివే!
కొత్త తరం స్మార్ట్ ఫోన్ 6ఎస్ ప్లస్ తో పాటు యాపిల్ సంస్థ మరిన్ని వినూత్న ఉత్పత్తులను మార్కెట్లోకి విడుదల చేసింది. వీటిల్లో ఐపాడ్ ప్రో, స్మార్ట్ కీబోర్డ్, పెన్సిల్ స్టైలస్, యాపిల్ టీవీలతో పాటు సరికొత్త రిమోట్, పలు కొత్త యాప్స్ ను అందుబాటులోకి తెచ్చింది. ఐపాడ్ ప్రో, తొలితరం ఐపాడ్ కు అడ్వాన్డ్స్ వర్షన్. 12.9 అంగుళాల స్క్రీన్ తో లభించే ఈ ఐపాడ్ లో 5.6 మిలియన్ పిక్సెల్ రెజల్యూషన్, రెటీనా డిస్ ప్లేతో పాటు ఫోటోషాప్ లో చిత్రాలను ఎడిటింగ్ చేసుకునే సదుపాయం ఉంటుంది. వైఫై, 4జీ వేరియంట్లలో లభించే దీని ధరలు 799 డాలర్ల నుంచి (32 జీబీ) మొదలవుతాయి. ఇక స్మార్ట్ కీబోర్డు విషయానికి వస్తే, ఐపాడ్ నుంచి ఐఫోన్ వరకూ దేనికైనా దీన్ని వినయోగించుకోవచ్చు. మాక్ బుక్ లో మాదిరిగానే బటన్ టెక్నాలజీని వాడి దీన్ని తయారు చేశారు. నవంబర్ లో అందుబాటులోకి రానున్న దీని ధర 169 డాలర్లుగా ఉంటుంది. వీటితో పాటు విడుదల చేసిన పెన్సిల్ స్టైలస్ నిన్నటి యాపిల్ సమావేశంలో అందరినీ అలరించింది. దీంతో పలు రకాల మందంతో, రంగుల్లో అక్షరాలు, గీతలు స్మార్ట్ ఫోన్ పై గీసుకోవచ్చు. కలర్ షేడ్స్ మార్చుకోవచ్చు. ఇదో 'ట్రూ డ్రాయింగ్ ఇన్ స్ట్రుమెంట్' అని యాపిల్ ప్రకటించింది. దీని ఖరీదు 99 డాలర్లు. ఇక చివరిగా యాపిల్ టీవీ. పేదలకు సైతం అందుబాటులో ఉండేలా ఈ టీవీలు రూ. 10 వేలకన్నా లోపు ధరలోనే (సుమారు 160 డాలర్లు) లభించనున్నాయి. వీటికి అదనంగా యాపిల్ డిజైన్ చేసిన సరికొత్త సెట్ టాప్ బాక్స్, కొత్త ఆపరేటింగ్ సిస్టమ్ టీవీఓఎస్, 'సిరి' టెక్నాలజీ ఆధారిత రిమోట్ లను యాపిల్ మార్కెట్లోకి విడుదల చేసింది.