: 'కేశవరెడ్డి' విద్యా సంస్థల అధినేత అరెస్ట్... వందల కోట్ల మేర అప్పుల్లో కేశవరెడ్డి
తెలుగు రాష్ట్రాల్లో కేశవరెడ్డి విద్యాసంస్థల పేరిట లెక్కకు మిక్కిలి విద్యాలయాలను ప్రారంభించి ప్రముఖ విద్యావేత్తగా ఎదిగిన కేశవరెడ్డి కొద్దిసేపటి క్రితం అరెస్టయ్యారు. విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి వందల కోట్ల మేర డిపాజిట్లు సేకరించిన కేశవరెడ్డి, గడువు తీరినా డిపాజిట్ సొమ్మును వెనక్కివ్వలేదు. దీనిపై బాధితులు సదరు విద్యాసంస్థల ముందు ఆందోళనకు దిగారు. ఈ క్రమంలో తెలుగు రాష్ట్రాల్లో కేశవరెడ్డిపై పోలీసులకు ఫిర్యాదులు వెల్లువెత్తాయి. ఇదలా ఉంటే, బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాలకు సంబంధించి వాయిదాలు చెల్లించడంలోనూ కేశవరెడ్డి విఫలమయ్యారు. ఈ క్రమంలో ఆయన విద్యా సంస్థలకు చెందిన ఆస్తులను ఆయా బ్యాంకులు వేలానికి పెట్టాయట. ఈ విషయం తెలుసుకున్న మీదటే కేశవరెడ్డి వద్ద డిపాజిట్లు చేసిన విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళనలకు తెర తీసినట్లు తెలుస్తోంది. కర్నూలు జిల్లాలోని నంద్యాలకు చెందిన కేశవరెడ్డి తన సొంతూరులో చిన్న స్కూల్ ఏర్పాటు చేసి అంచెలంచెలుగా ఎదిగారు. ఫిర్యాదుల నేపథ్యంలో కేశవరెడ్దిని నేటి ఉదయం అదుపులోకి తీసుకున్న కర్నూలు పోలీసులు మరికాసేపట్లో ఆయనను కోర్టులో హాజరుపరచనున్నారు. రిమాండ్ అనంతరం వారం రోజుల పాటు కేశవరెడ్డిని తమ కస్టడీకి అప్పగించాలని పోలీసులు కోర్టును కోరనున్నట్లు విశ్వసనీయ సమాచారం.