: యాభై ఏళ్ల నాటి ఆ సంతకం విలువ ఇప్పుడు రూ. 150 కోట్లు!
దాదాపు 50 సంవత్సరాల క్రితం తమిళనాడు ముఖ్యమంత్రి దివంగత కామరాజ్ చేసిన సంతకం, ఆ రాష్ట్ర ప్రభుత్వానికి రూ. 150 కోట్ల విలువైన ఆస్తిని దగ్గర చేసింది. వివరాల్లోకి వెళితే, 1960లో సహకార శాఖ కోసం రామకృష్ణ మొదలియార్ నుంచి ప్రభుత్వం రూ. 33,941కు ఓ స్థలాన్ని కొనుగోలు చేసింది. ఆపై సహకార శాఖకు ఆ స్థలాన్ని ఉపయోగించ లేదు. ఇదే కారణం చూపుతూ మొదలియార్ వారసులు కోర్టుకెక్కారు. కింది కోర్టు, హైకోర్టు సైతం, సేకరించిన స్థలాన్ని వాడనందుకు దాన్ని వారసులకే అప్పగించాలని తీర్పిచ్చాయి. తమిళ సర్కారు తీర్పును మరోసారి సమీక్షించాలని కోరడంతో, తిరిగి విచారణ జరిపిన హైకోర్టు ఆ స్థలం ఎక్కడుందో వెతికించాలని ఆదేశించింది. ఆ స్థలం ఎక్కడుందని వెతికితే, ప్రస్తుతం రహదారుల శాఖ భవనాలు ఆ స్థలంలో ఉన్నాయి. ఆ స్థలం వారికెందుకు వెళ్లిందని పరిశీలిస్తే, సహకార శాఖ ఉపయోగించడం లేదు కాబట్టి, దాన్ని తమకు అప్పగించాలని రహదారుల శాఖ దస్త్రం పంపడం, దానిపై కామరాజర్ సంతకం చేసిన సంగతి బయటకు వచ్చింది. దీంతో తామిచ్చిన తొలి తీర్పును సవరించుకుంటున్నామని, స్థలం ప్రభుత్వానిదేనని హైకోర్టు వెల్లడించింది. ఈ స్థలం విలువ ఇప్పుడు రూ. 150 కోట్లకు పైమాటే.