: మారియా బదిలీ వెనుక కారణాలు ఇవేనా?
షీనా బోరా హత్య కేసు దర్యాప్తు చేస్తున్న రాకేష్ మారియాను ముంబయి పోలీస్ కమిషనర్ బాధ్యతల నుంచి ఎందుకు తప్పించారన్న విషయంపై రకరకాల ఊహాగానాలు చెలరేగుతున్నాయి. పదోన్నతులలో భాగంగానే ఆయన బదిలీ జరిగిందంటూ రాష్ట్ర ప్రభుత్వ అధికారులు, కేంద్ర హోంశాఖ సైతం ప్రకటన చేసి ఊరుకుంది. ఈ కేసు దర్యాప్తు నుంచి ఆయన్ని పక్కన పెడుతున్నట్లు చెప్పారు. మళ్లీ కొద్ది గంటల్లోనే ఈ కేసు దర్యాప్తును మారియానే కొనసాగిస్తారన్న ప్రకటనా వెలువడింది. ఇదంతా చూస్తుంటే..మారియా బదిలీ వెనుక రాజకీయ కారణాలు ఉన్నాయనిపిస్తోంది. అందుకు ఈమధ్య కాలంలో జరిగిన కొన్ని సంఘటనలే నిదర్శనంగా చెప్పవచ్చు. షీనా బోరా హత్య కేసుపై అనవసరమైన శ్రద్ధ ఎందుకు కనబరుస్తున్నారంటూ సాక్షాత్తూ మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ఆ శాఖకు సంబంధించిన అధికారులను ప్రశ్నించినట్లు సమాచారం. రాష్ట్రంలో ఎన్నో కేసులు ఉండగా ఈ కేసుపైనే మారియా అత్యుత్సాహం ప్రదర్శించడంపై ఫడ్నవీస్ అసంతృప్తిగా ఉన్నట్లు సంబంధిత శాఖ అధికారులు చెబుతున్నారు. అందుకే ఆయనకు పదోన్నతి ఇచ్చి పక్కకు తప్పించారు. షీనా హత్య కేసులో మారియానే ఎందుకు విచారణకు వెళ్లాల్సివచ్చిందనేదానికి..హై ప్రొఫైల్, సహకరించని మనస్తతత్వం ఉన్న ఇంద్రాణి హై ఫై ఇంగ్లీషులో మాట్లాడుతుండటమేనని మారియా సన్నిహితులు సమాధానమిస్తున్నారు. తనకు పదోన్నతి వస్తుందని మారియాకు తెలుసు. కానీ, 22 రోజుల ముందుగానే ఆర్డర్లు వస్తాయని ఊహించని మారియా ఆశ్చర్యానికి గురవడమే కాకుండా, స్తబ్ధుడయ్యారనీ ఆయన సన్నిహితులు చెబుతున్నారు. సోమవారం నాడు జపాన్ వెళ్లే ముందు ముఖ్యమంత్రి ఫడ్నవీస్ మారియా పదోన్నతి, బదిలీ పత్రాలపై సంతకం చేశారు. ఉన్నతాధికారుల బదిలీల విషయంపై గతంలో సుప్రీంకోర్టు ఆదేశించినట్టు పోలీసు శాఖ ఎస్టాబ్లిష్ మెంట్ బోర్డ్ మీటింగు జరిగిందా? లేదా? అన్నది తెలియరాలేదు. అదీగాక, ముఖ్యమంత్రి ఫడ్నవీస్, పోలీసు అధికారి మారియాల మధ్య సంబంధాలు పెద్దగా బాగుండలేదని తెలుస్తోంది. గతంలో వీరిద్దరూ ఒక విషయమై విభేదించారట. ముంబయిలో రెస్టారెంట్లు, క్లబ్బులు, బార్లు రాత్రంతా తెరచి ఉంచాలని శివసేన యువనేత ఆదిత్య ఠాక్రే కోరగా అందుకు మారియా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. కానీ, అక్కడి బీజేపీ ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేసింది. తాజాగా, ఐపీఎల్ మాజీ చైర్మన్, మనీ ల్యాండరింగ్ వ్యవహారంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న లలిత్ మోదీని మారియా కలవడంపై సమాధానం చెప్పాలని ఆయన్ని ఫడ్నవీస్ అడగడం తెలిసిన విషయమే. ఈ కారణాలన్నీ మారియా బదిలీ వెనుక కథలే అని తెలుస్తోంది.