: హీరోయిన్ల ట్వీట్లు... నెటిజన్ల తిట్లు!
ప్రస్తుతం జైన మతస్థులకు పవిత్రమైన రోజులు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ముంబయిలో మాంసం అమ్మకాలను కొన్ని రోజుల పాటు నిషేధించారు. దీనిపై కొందరు పాజిటివ్ గా స్పందించగా, మరికొందరు నెగెటివ్ గా మాట్లాడారు. ఈ విషయాలను సామాజిక మాధ్యమాల ద్వారా కూడా పోస్ట్ చేసిన వారు ఉన్నారు. సాధారణ వ్యక్తులు ఏమి మాట్లాడినా, ఎటువంటివి పోస్టు చేసినా పెద్దగా పట్టించుకోము. కానీ, సెలబ్రిటీలు మాత్రం ఆచితూచి అడుగువేయాల్సిందే. ఈ అంశంపై బాలీవుడ్ సెలబ్రిటీలు వారి తరహాలో చేసిన కామెంట్లు సామాజిక మాధ్యమాల్లో దర్శనమిచ్చాయి. మాంసంపై నిషేధాన్ని ఖండిస్తున్నానంటూ మంగళవారం నాడు సోనమ్ కపూర్ ట్విట్టర్లో వ్యాఖ్యానించింది. అంతేకాకుండా, ఈ తరహా చర్యల కారణంగా మనం కొత్త ప్రపంచానికి చెందిన వారమవుతామనీ రాసింది.దీంతో నెటిజన్లకు చిర్రెత్తుకొచ్చింది. సోనమ్ వ్యాఖ్యలను నిరసిస్తూ వందల సంఖ్యలో కామెంట్లు వచ్చాయి. కాగా, నేనేమీ తక్కువ తినలేదంటూ సోనాక్షి సిన్హా కూడా మాంసం నిషేధంపై ట్వీట్ చేసింది. భారతదేశం స్వతంత్ర దేశం అని ఒప్పుకుంటూనే, 'బ్యానిస్థాన్ కు స్వాగత'మంటూ చేసిన సెటైరికల్ ట్వీట్ పై కూడా విమర్శలు కురిశాయి.