: నవ్యాంధ్ర రాజధానికి తరలిపోనున్న ఆంధ్రా బ్యాంకు ప్రధాన కార్యాలయం
స్వాత్రంత్ర్య సమరయోధుడు భోగరాజు పట్టాభి సీతారామయ్య స్వహస్తాలతో ప్రారంభించిన ఆంధ్రా బ్యాంకు... తెలుగోడి గుండె చప్పుడే. ఆ బ్యాంకు పేరు వింటేనే ఇది తమదేనన్న భావన తెలుగు ప్రజల్లో మెదలడం ఖాయమే. అయితే ఇది తెలుగు ప్రజలు ఉమ్మడి రాష్ట్రంలో కలిసి ఉన్నప్పటి వరకు మాత్రమే. మొన్న తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో ఆంధ్రా బ్యాంకు బోర్డులను తెలంగాణవాదులు పీకేశారు. కొన్ని చోట్ల ‘తెలంగాణ బ్యాంకు’ అంటూ ఆంధ్రా బ్యాంకు పేరును కూడా మార్చేశారు. ఉమ్మడి రాష్ట్రం రెండుగా విడిపోయింది. అయినా ఆంధ్రా బ్యాంకు ప్రధాన కార్యాలయం మాత్రం హైదరాబాదులోనే ఉండిపోయింది. తాజాగా ఆంధ్రా బ్యాంకు ప్రధాన కార్యాలయాన్ని నవ్యాంధ్ర రాజధాని అమరావతికి తరలించే దిశగా అటు బ్యాంకు అధికారులతో పాటు ఇటు ఏపీ ప్రభుత్వం కూడా సన్నాహాలు ప్రారంభించింది. నిన్న ఆంధ్రా బ్యాంకు జనరల్ మేనేజర్ గుప్తా విజయవాడలో ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడిని కలిశారు. ఈ సందర్భంగా బ్యాంకు ప్రధాన కార్యాలయాన్ని అమరావతికి తరలించే విషయం వీరిద్దరి మధ్య ప్రస్తావనకు వచ్చింది. బ్యాంకు హెడ్డాఫీస్ ను హైదరాబాదు నుంచి అమరావతికి తరలించేందుకు గుప్తా దాదాపుగా సంసిద్ధతను వ్యక్తం చేసినట్లు సమాచారం. హెడ్డాఫీసును అక్కడికి తరలించడం ద్వారా అమరావతిని ఆర్థిక రాజధానిగా మార్చడానికి దోహదపడాలని ఈ సందర్భంగా గుప్తాను చంద్రబాబు కోరారు.