: త్వరపడండి, మార్స్ పైకి పేరు పంపాలంటే నేడే ఆఖరు... ఎలా పంపాలంటే!
మార్స్ గ్రహంపైకి మీ పేరు పంపాలనుకుంటున్నారా? అయితే, నేడే ఆఖరు రోజు. మార్స్ భూభౌతిక పరిస్థితిని పరిశీలించేందుకు నాసా ప్రారంభించిన ఓ రోబోటిక్ మిషన్ 'ఇన్ సైట్' తో పాటు నాసా వెబ్ సైట్లో రిజిస్టర్ చేసుకున్నవారి పేర్లను ఆ గ్రహంపైకి పంపనున్నారు. ఇందులో మీ పేరు యాడ్ చేసుకోవాలంటే నాసా అధికార వెబ్ సైట్ లో రిజిస్టర్ చేసుకోవాలి. అందుకు "http://mars.nasa.gov/participate/send-your-name/insight/" ను క్లిక్ చేయాల్సి వుంటుంది. తమ వద్ద రిజిస్టర్ చేసుకున్న పేర్లన్నింటినీ ఓ చిప్ లో చేర్చి మార్స్ పైకి పంపుతామని నాసా ఇప్పటికే వెల్లడించింది. ఈ ఉపగ్రహం వచ్చే సంవత్సరం మార్చి 4న కాలిఫోర్నియా ఎయిర్ ఫోర్స్ బేస్ నుంచి అట్లాస్ వీ 401 రాకెట్ సాయంతో నింగిలోకి చేరనుంది. ఆపై సెప్టెంబర్ 20న మార్స్ పై ల్యాండ్ అవుతుంది. రెండేళ్ల పాటు మార్స్ పై తిరుగాడుతూ పరిశోధనలు చేస్తుంది. కాగా, ఇప్పటివరకూ 6 లక్షల మందికి పైగా ప్రజలు ఈ సైట్ ద్వారా తమ పేర్లను నమోదు చేసుకుని 'ఇన్ సైట్' బోర్డింగ్ పాసులు తీసుకున్నారు. మార్స్ పైకి ఇప్పుడు మనం ఎలాగూ వెళ్లలేం, కనీసం పేరునైనా పంపుకోవచ్చుగా, ఏమంటారు?